ఒక గీత గీసి అసంబద్ధంగా భారత్-పాక్ ను విడగొట్టారా?

Update: 2022-08-17 03:53 GMT
అఖండ భారత్ ను విడగొట్టి పాకిస్తాన్-ఇండియాలు చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండని  బ్రిటన్ దేశం స్వాతంత్య్రాలు ఇచ్చి  చేతులు దులుపుకుంది. భారత్, పాకిస్తాన్ ను ఎలా విభజించాలన్న దానిపై అప్పటి బ్రిటీష్ న్యాయవాది రాడ్ క్లిఫ్ కు బ్రిటీష్ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. కేవలం 5 వారాలు మాత్రమే సమయం ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం చివర్లో బ్రిటీష్ ఇండియాకు స్వాతంత్ర్యం ఇచ్చిన బ్రిటన్.. ముస్లింలు ఎక్కువగా మెజార్టీగా ఉండే పాకిస్తాన్ అనే దేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15 భారత్, పాకిస్తాన్ లు అవతరించాయి.  రెండు దేశాలను విభజించేందుకు బౌండరీ మిషన్ ను ఏర్పాటు చేశారు. ఆ బౌండరీ మిషన్ కు న్యాయవాది సిరిల్ రాడ్ క్లిఫ్ ను చైర్మన్ గా నియమించారు. స్వాతంత్ర్యం వచ్చిన రెండు రోజులకు రెండు దేశాలకు రెండు భౌగోళిక చిత్రాలను రాడ్ క్లిఫ్ విడుదల చేశారు.

పంజాబ్ వైపు భారత్-పాకిస్తాన్ మధ్య విభజన గీతను 'రాడ్ క్లిఫ్ లైన్' అనడానికి కారణం రాడ్ క్లిఫ్ ఇక్కడి నుంచే దేశ విభజనను మొదలుపెట్టాడు. రెండు దేశాలకు భారత్ విడిపోతుందని తెలియగానే చాలా మంది హిందూ, ముస్లింలు భారత్ నుంచి పాకిస్తాన్ కు.. పాక్ నుంచి భారత్ కు వలసలు పోయారు. విభజన వల్ల చెలరేగిన హింసలో 10 లక్షల మంది చనిపోయారు. నాడు 1.20 కోట్ల మంది రెండు దేశాల సరిహద్దులు దాటి ఉంటారని అంచనా..

రాడ్ క్లిఫ్ దేశ విభజనకు కేవలం నెల ముందు వచ్చాడు. దేశం గురించి రాజకీయ, సామాజిక సమీకరణాలపై అతడికి అవగాహన లేదు.  5 వారాల్లోనే విభజన కోసం ఆయన మ్యాపులు తీసుకొని జనాభా లెక్కలు చూసుకోకుండా అరకొర సమాచారంతో తక్కువ సమయంలోనే ఒక గీత గీసి ఇండియా పాకిస్తాన్ ను విభజించారు. దీనికి ఇద్దరు హిందూ, ఇద్దరు ముస్లిం జడ్జీలు రాడ్ క్లిఫ్ కు సహకరించారు. పాకిస్తాన్ లో పెద్ద నగరాలు లేకపోవడంతో పంజాబ్ లోని లాహోర్ ను పాకిస్తాన్ దేశానికి రాడ్ క్లిఫ్ ఇచ్చేశాడు. ఇక వెళ్లిపోయే ముందు అన్ని పత్రాలను కాల్చి మరీ రాడ్ క్లిఫ్ బ్రిటన్ వెళ్లిపోవడం గమనార్హం.

భారత్-పాకిస్తాన్ మధ్య సుమారు 2900 కిలోమీటర్లు ఉండే రాడ్ క్లిఫ్ లైన్ నేటికి వివాదంగానే ఉంది. 1947లో రెండు ప్రావిన్సుల వివాదం నడిచింది. తూర్పులో ఉండే బెంగాల్, మరొకటి పశ్చిమాన ఉండే పంజాబ్ . బెంగాల్ లో ముస్లింల జనాభా , హిందువుల జనాభా సమానం. ఇక పంజాబ్ లో ముస్లింలు, సిక్కులు సమానంగా ఉంటారు. ఈ రెండింటిని సమానంగా పాకిస్తాన్, భారత్ మధ్యలో రాడ్ క్లిఫ్ విభజించాడు.ఈ విభజన వల్లే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక స్వతంత్ర కశ్మీర్ ను ఇండియా లేదా పాకిస్తాన్ లో చేరే స్వేచ్ఛను దానికే బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చింది.

నాటి కశ్మీర్ పాలకుడు హరిసింగ్.. తొలుత కశ్మీర్ ను స్వతంత్రంగా ఉంచాలని కోరుకున్నాడు. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ ఆదివాసీలు కశ్మీర్ మీదకు దండెత్తిరావడంతో భారత్ సాయం చేసింది. దాంతో భారత్ లో చేరుతున్నట్టు 1947 అక్టోబర్ లో హరిసింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి భారత్ -పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాడు ఐక్యరాజ్యసమితి సాయం కోరారు. దీంతో రెండు దేశాలు 1949లో కాల్పుల విరమణ పాటించాయి. కశ్మీర్ రెండుగా విడిపోయింది. కొంత పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్లగా.. మరికొంత భారత్ లోకి వచ్చింది. నేటికి కశ్మీర్ రెండు దేశాల మధ్య యుద్ధాలకు విద్వేశాలకు కారణం అవుతోంది.
Tags:    

Similar News