అమరావతి రైతుల పాదయాత్రపై డీజీపీ మాటలు విన్నారా?

Update: 2022-10-15 04:30 GMT
ఏపీ రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులు.. తమకు ఇచ్చిన మాట ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతినే ఏర్పాటు చేయాలని కోరుతూ రెండో విడత పాదయాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణతో పాటు.. వారికి వ్యతిరేకంగా అధికారపక్షానికి చెందిన వారు చేపడుతున్న నిరసనలకు అనుకూలంగా.. రైతుల పాదయాత్రకు ప్రతికూలంగా పోలీసుల తీరు ఉంటుందన్న ఆరోపణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి వేళ.. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

మీ నిరసనలు మీరు చేసుకోండి.. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దని నిరసన చేపట్టే నిర్వాహకులకు తాము చెబుతున్నట్లుగా చెప్పారు ఏపీ డీజీపీ. పాదయాత్ర సాగుతున్న జిల్లా ఎస్పీ.. పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిని ముందుగా పిలిపించి యాత్రను అడ్డుకోవద్దంటూ చెబుతున్నారన్న ఆయన..

'ఇప్పటివరకు ఎక్కడా తీవ్ర సమస్యలు వచ్చినట్లుగా కనిపించలేదు. అలాంటివి ఎక్కడైనా ఎదురైతే చర్యలు తీసుకుంటాం. పోలీసులే పాదయాత్రను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదు. పూర్తి అబద్ధం. మేంసమస్యల్ని పరిష్కరించటానికి ప్రయత్నిస్తాం. మేం ఎందుకు అలా చేస్తాం. సమస్యల్ని సంక్లిష్టం చేయటం మాకు ఇష్టం లేదు' అంటూ వ్యాఖ్యానించారు.

పాదయాత్రపై ప్రతి రోజు సమీక్షిస్తున్నామని.. సమస్యలు వస్తే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్రకు వ్యతిరేకంగా చేసే నిరసనల్లో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఇప్పటివరకు చోటు చేసుకోలేదని.. అన్ని ప్రశాంతంగా జరిగినట్లు చెప్పారు. యాత్ర సాగుతున్న జిల్లా ఎస్పీలతో మాట్లాడుతున్నామని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో ఏపీ సీఐడీ పోలీసులు సీఆర్ పీసీ 41ఏ నోటీసులు ఇవ్వకుండానే పలువురిని అరెస్టు చేయటంపై కోర్టులు పదే పదే ప్రశ్నిస్తున్నాయి కదా? అయినా మీ తీరు ఎందుకు మారట్లేదు? అంటూ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ''ఈ అంశంపై మీరు  సంబంధిత అధికారితో మాట్లాడండి. నేను డీజీపీగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతోంది. మీరెందుకు అలా చేశారు.. ఇలా చేశారని కోర్టులు మమ్మల్ని తప్పు పట్టలేదు'' అని చెప్పారు.

విపక్ష నేతల్ని అసభ్యంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు కేసులు నమోదు చేయట్లేదని.. అధికారపక్షానికి చెందిన వారిని ప్రశ్నించినా..చిన్న పోస్టు పెట్టినా వెంటనే కేసు పెడుతున్నారు కదా? అని అడగ్గా.. 'అలాంటి ఘటనలకు సంబంధించిన స్పష్టమైన వివరాలు ఉంటే చెప్పాలి. వాటిని పరిశీలిస్తాం' అని వ్యాఖ్యానించటం గమనార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News