అక్క‌డ పెట్రోల్ ధ‌ర‌ను డీజిల్ దాటేసింది!

Update: 2018-10-22 05:52 GMT
పెట్రోల్‌తో పోలిస్తే.. డీజిల్ ధ‌ర కారుచౌక‌గా ఉంటుంది. ఒక‌ప్పుడు రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసం భారీగా ఉండేది. ఈ కార‌ణంతోనే డీజిల్ వాహ‌నాల ధ‌ర‌లు కాస్త ఎక్కువ‌గా ఉన్నా.. వాటిని కొనుగోలు చేసే వారు. దీనికి తోడు మైలేజీ కూడా పెట్రోల్ కంటే డీజిల్ లో ఎక్కువ‌గా ఉండ‌టం ఒక కార‌ణంగా చెప్పాలి.

ఒక‌ప్పుడు పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ లీట‌రు ధ‌ర త‌క్కువ‌లో త‌క్కువ రూ.15 వ‌ర‌కూ వ్య‌త్యాసం ఉండేది. మోడీ హ‌యాంలో అలాంటి ప‌రిస్థితి మారిపోయింది. డీజిల్ ధ‌ర‌ను ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో అంత‌కంత‌కూ పెంచుకుంటూ వ‌చ్చిన మోడీ స‌ర్కారు.. తాజాగా రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసం లీట‌రుకు రూ.ఎడెనిమిది కంటే ఎక్కువ లేని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. ఒక రాష్ట్రంలో అయితే పెట్రోల్ ధ‌ర‌ను డీజిల్ దాటేసింది. ఏపీకి పొరుగున ఉన్న ఒడిశాలో తాజాగా ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో డీజిల్ ధ‌ర పెట్రోల్ ధ‌ర కంటే ఎక్కువ‌గా ఉండ‌టంపై ఆ రాష్ట్రంలోని ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఎక్క‌డా లేని విధంగా పెట్రోల్ ధ‌ర కంటే డీజిల్ ధ‌ర ఎక్కువ కావ‌టానికి కార‌ణం ఏమిట‌న్న ఆరా తీస్తే అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. పెట్రోల్.. డీజిల్ బేస్ ధ‌ర‌ల్లోనే తేడా ఉండ‌టం.. పెట్రోల్ కంటే డీజిల్ ధ‌ర ఎక్కువ కావ‌టంతో ఇలాంటి ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు.

తాజాగా ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ లో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.80.57గా ఉంటే.. డీజిల్ పెట్రోల్ ధ‌ర రూ.80.69గా కొన‌సాగుతోంది. దీంతో.. దేశంలో తొలిసారి పెట్రోల్ కంటే డీజిల్ ధ‌ర ఎక్కువైన రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.  ఇదిలా ఉంటే.. ఆయిల్ కంపెనీల‌తో కేంద్రం లాలూచీ ప‌డిన కార‌ణంగానే పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయ‌ని ఒడిశా ప్ర‌భుత్వం ఆరోపిస్తోంది.

అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గుతున్నా.. దేశంలో మాత్రం పెట్రో భ‌గ‌భ‌గ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయ‌ని చెబుతున్నారు. డీజిల్ ధ‌ర పెరిగే కొద్దీ ర‌వాణా ఛార్జీల‌తో పాటు.. వివిధ రంగాల మీద ప్ర‌భావం చూపిస్తోంద‌ని.. ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌న్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News