ఆ ఇష్యూలో కేసీఆర్ కు పూర్తి భిన్నం కేటీఆర్!

Update: 2016-10-12 06:02 GMT
కేసీఆర్ తో కేటీఆర్ ను కొంతమంది పోల్చి చూస్తుంటారు. తండ్రి మాదిరే మంచి మాటకారి అని.. ఆయన విజన్ కూడా క్లియర్ గా ఉంటుందని.. మాట కటువుగా ఉన్నా మనసు మాత్రం సున్నితమని.. అందరిని కలుపుకుపోయే తత్వం ఎక్కువని.. తండ్రి మాదిరి పెద్దల్ని గౌరవించటం.. వారి పట్ల మర్యాదగా వ్యవహరించటం లాంటివి చేస్తుంటారని చెబుతుంటారు. ఆఫ్ ద రికార్డులో అయితే.. టీఆర్ ఎస్ ముఖ్యనేతల్లో చాలా మందితో పోలిస్తే.. కేటీఆర్ కు డబ్బు వ్యామోహం చాలా తక్కువని.. ఈ విషయంలోనూ తండ్రి మాదిరే ఆయన వ్యవహరిస్తారన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
తండ్రి మాదిరే కొడుకులోనూ చాలా విషయాలు కలుస్తాయని చెప్పినా.. ఫారిన్ టూర్ల విషయంలో మాత్రం తండ్రితో ఏ మాత్రం పోలిక ఉండదని చెబుతుంటారు. ఫారిన్ టూర్ల సంగతి తర్వాత.. ఢిల్లీకి వెళ్లేందుకు సైతం కేసీఆర్ అంత ఆసక్తి ప్రదర్శించరని చెబుతుంటారు. ఏదో తప్పనిసరి అయితే తప్పించి అట్టే ప్రయాణాలకు ఆయనకు ఇష్టం ఉండదని చెబుతుంటారు.

కొద్ది మంది ముఖ్యమంత్రులు మాత్రమే విదేశీ పర్యటల్ని తరచూ చేస్తుంటారు. పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు.. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు విదేశీ పర్యటనల్ని చేస్తున్నట్లుగా చెబుతుంటారు. మాటల్లో ఉండే హడావుడి నిజంగా పెట్టుబడులు రాష్ట్రానికి ఎన్ని వ‌స్తున్నాయన్నది లెక్క తేలిస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తరచూ విదేశీ పర్యటనలు చేస్తుంటారు. వీటి వల్ల పెట్టుబడులు వచ్చే ముచ్చట ఎలా ఉన్నా.. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను విదేశీ వేదికల మీద నానేలా చేస్తారని చెప్పొచ్చు.

మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. విదేశీ పర్యటనల విషయంలో కేటీఆర్ తీరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి ఉంటుందని చెబుతుంటారు. తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే బాబుకు తగ్గట్లే కేటీఆర్ కూడా వెళుతుంటారన్న విమర్శ ఉంది. తాజాగా ఆయన మరో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 19 వరకు జరిపే తాజా పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు.. పరిశ్రమల ఆకర్షణే ధ్యేయంగా తాజా ఫారిన్ టూర్ చేపట్టినట్లుగా చెబుతున్నారు.

వాషింగ్టన్ డీసీ.. న్యూజెర్సీ.. న్యూయార్క్.. సిలికాన్ వ్యాలీ.. చికాగో.. మిన్నెసొటా తదితర ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటిస్తారని చెబుతున్నారు. ఈ టూర్లో పలు విదేశీ కంపెనీలకు చెందిన ముఖ్యులతో ఆయన భేటీ కానున్నారని.. పలు ఒప్పందాలు చేసుకోనున్నారని చెబుతున్నారు. ఫారిన్ టూర్ల జోరుకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కలిగితే.. అంతుకు మించి కావాల్సిందేముంది?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News