ఇదీ ఇద్దరు చంద్రుల మధ్య తేడా...!

Update: 2018-12-27 05:03 GMT
ఇద్దరూ రాజకీయ ఉద్దండులే. ఇద్దరు రాజకీయాల్లో ఆరితేరిన వారే. ఇద్దరు కార్యసాధకులే. ఇద్దరు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వారే. ఇద్దరు రాజకీయ శత్రువులే. అయితే వారిద్దరిలోనూ ఓ స్వచ్ఛమైన... ఓ స్పష్టమైన తేడా కనపడుతోంది. ఒకరు రెట్టించిన ఆత్మ విశ్వాసంతో ముందుకి వెళ్తుంటే... మరొకరు తెలియని భయంతో కుంచించుకుపోతున్నారు. ఒకరు చిరునవ్వు పెట్టుబడిగా తమ రాష్ట్రానికి అన్నీ  సాధించుకుంటూంటే మరొకరు మాత్రం తన కోపమే తన శత్రువు అంటు తనను నమ్మి అధికారం ఇచ్చిన వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు చంద్రులు ఎవరో తెలిసే ఉంటుంది కదా... అవును.. వారే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే... మరొకరు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. రాజకీయంగా ఒకరికొకరు తీసిపోని వారే అయినా.... కేంద్రం నుంచి వివిధ పనులు చక్కబెట్టుకుని రాష్ట్రానికి మేలు చేస్తున్నది మాత్రం నిస్సందేహంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం గిల్లికజ్జాలతో కేంద్రంపై పెట్టుకున్న వైరాన్ని నానాటికీ ఎక్కువ చేసుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాల పై 16 వినతి ప్రతాలు అందజేశారు. గంటకు పైగా సాగిన వీరి సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయంటున్నారు. వాటిలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కూడా వచ్చే ఉంటాయన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. అయితే ఏవి ఎన్ని వచ్చినా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం చిరునవ్వుతో ఆయనకు కావాల్సిన పనులు చేయించుకున్నారు. ముఖ్యంగా ప్రధానిని కలిసి వచ్చిన గంటలోగానే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హైకోర్టును వారం రోజుల్లోగా విడగొట్టాలని కీలక ఆర్డినెన్స్ తెప్పించుకున్నారు. ఇక మిగిలిన అంశాలపై కూడా ప్రధానమంత్రి సానుకూలంగానే వ్యవహరించారంటున్నారు. ఇదీ పాలనా దక్షుని వ్యవహారశైలి అని రాజకీయ వర్గాల్లోనూ, పరిశీలకుల్లోను వినిపిస్తున్న మాట.

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం నాలుగేళ్లు స్నేహం చేసినా చిన్న పని కూడా సాధించుకోలేకపోయారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా మాట అలా ఉంచినా.... విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్- కడప స్టీల్ ఫ్యాక్టరీ వంటివి కూడా రాలేదని వారు గుర్తు చేస్తున్నారు. తన అవసరాల కోసం స్నేహం చేసి ఆ తర్వాత పట్టించుకోనట్లు వ్యవహరిస్తే ఇలాగే ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రధానిని- భారతీయ జనతా పార్టీని ఎండగట్టిన కె.చంద్రశేఖర రావు ఎన్నికల తర్వాత మాత్రం వాటి జోలికే వెళ్లకుండా అభివృద్ధి వైపే చూశారంటున్నారు. ఇదే ఇద్దరు చంద్రుల మధ‌్య ఉన్న తేడా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 
Tags:    

Similar News