శ‌శిక‌ళ వ‌ర్గం కూడా విలీనం అయిపోతుంద‌ట‌

Update: 2017-09-27 13:23 GMT
త‌మిళ‌నాడులో అధికార పార్టీలోని పంచాయ‌తీలు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ లో ఆరోగ్యం క్షీణించటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను చేర్పించిన అనంత‌రం మొద‌లైన రాజ‌కీయాలు ఇటీవ‌ల ఓ కొలిక్కి వ‌చ్చిన‌ప్ప‌టికీ మ‌రో ట్విస్ట్ చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. చీలిక వ‌ర్గాలైన తాజా సీఎం ప‌ళ‌నిస్వామి - మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం కూట‌ములు ఏక‌మ‌య్యాయా. అయితే అన్నాడీఎంకేలోని మ‌రో వైరివర్గమైన చిన్న‌మ్మ శ‌శిక‌ళ బృందం కూడా వీరితో జ‌త‌కూడ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

 లోక్‌ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తాజాగా మీడియాలో మాట్లాడుతూ పళని, పన్నీర్ వర్గాలతో శశి వర్గం కూడా చేతులు కలుపబోతుందని వెల్ల‌డించారు. ఇరు వర్గాల మధ్య కొన్ని అంశాల్లో భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, అవి కూడా త్వరలోనే క్లియర్ అవుతాయన్నారు. పార్టీలోని చీలిక వర్గాలన్నీ త్వరలోనే ఏకమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సమయంలో సీజ్ అయిన రెండాకుల గుర్తును కూడా త్వరలోనే తిరిగి సాధించుకుంటామని తంబిదురై ధీమా వ్యక్తం చేశారు. ఈ ప‌రిణామం చోటుచేసుకుంటే అన్నాడీఎంకే రాజ‌కీయం కీల‌క మ‌లుపు త‌రిఇగిన‌ట్ల‌ని భావిస్తున్నారు.

మ‌రోవైపు తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణం మిస్టరీని తెలుసుకునేందుకు పళనిస్వామి ప్రభుత్వం రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. అమ్మ మృతిపై రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగసామి నేతృత్వంలో న్యాయవిచారణకు ఆదేశించింది. ఈ విచార‌ణ‌కు స‌హ‌కరిస్తామ‌ని అమ్మ‌కు చికిత్స చేసిన అపోలో ఆస్ప‌త్రి స్ప‌ష్టం చేసింది. దివంగ‌త సీఎం జ‌యల‌లిత‌కు చేసిన చికిత్స తాలుకూ వివ‌రాల‌న్నింటినీ విచార‌ణ సంద‌ర్భంగా అందించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

కాగా, గతేడాది సెప్టెంబర్‌ లో ఆరోగ్యం క్షీణించటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలితను చేర్పించ‌గా....దాదాపు మూడు నెలల పాటు చికిత్స అందించినప్పటికీ ఆమె కోలుకోలేదు. డిసెంబర్‌ 5 న గుండెపోటు అధికం కావటంతో ఆమె మృతి చెందారు. ఐతే మూడు నెలల పాటు చికిత్స అందించినప్పటికీ అందుకు సంబంధించిన ఒక్క ఫోటో కానీ వీడియో కానీ మీడియాకు విడుదల చేయలేదు. దీంతో జయలలిత మరణంపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు మొదలయ్యాయి. అప్పటి సీఎం పన్నీర్‌ సెల్వం ను సైతం జయను చూసేందుకు అనుమతించ లేదు. అమ్మ మరణించే వరకు కూడా ఆమెకు అందిన వైద్యంపై ఎలాంటి సమాచారం లేకపోవటంతో స్వయంగా పన్నీర్ సెల్వమే న్యాయ విచారణకు  డిమాండ్‌ చేశారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, జయలలిత మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ సంచలన ప్రకటన చేశారు. జయలలితను చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చినప్పటి వీడియో ఫుటేజ్‌ శశకళ వద్ద ఉందని వెల్లడించారు. అపోలో ఆస్పత్రి యాజమాన్యం వద్ద కూడా ఆ వీడియో ఉందన్నారు. దర్యాప్తు కమిటీకి ఆ వీడియోను అందజేస్తామని చెప్పారు. జయలలితను చిన్నమ్మ రోజుకు రెండు నిమిషాలు మాత్రమే చూసేవారని దినకరన్ చెప్పారు. జయలలిత మరణంపై న్యాయవిచారణకు ఆదేశించటంపై పన్నీర్ సెల్వం సహా అన్నాడీఎంకే కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో అమ్మ మరణం వెనుక ఉన్న దుష్టశక్తుల వెన్నులో వణుకు మొదలైందని చెబుతున్నారు.
Tags:    

Similar News