కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య కోల్డ్ వార్!

Update: 2019-06-18 04:51 GMT
రాజ‌కీయ నేత‌లు ఎంత‌మంది ఉన్నా.. బ‌ల‌మైన పొలిటిక‌ల్ ఫ్యామిలీస్ కొన్నే ఉంటాయి. అలాంటి వాటి విష‌యానికి వ‌స్తే తెలంగాణ‌లో కోమ‌టిరెడ్డి బ‌ద్ర‌ర్స్ పేరును ప‌లువురు చెబుతారు. వారు ప్రాతినిధ్యం వ‌హించే న‌ల్గొండ జిల్లాలో మంచి ప‌ట్టుతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ కు రాజ‌కీయంగా మంచి ప‌లుకుబ‌డి ఉంద‌ని చెబుతారు.

రాష్ట్రం బ‌య‌ట పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసే ఈ ఇద్ద‌రు సోద‌రులు జంట క‌వుల్లా ఉంటార‌ని.. ఎన్నిక‌ల్లో వీరికి తిరుగు ఉండ‌ని ప‌రిస్థితి. తాము ఎటువైపు ఉంటే.. ప్ర‌జ‌లు అటు వైపు ఉంటార‌న్న న‌మ్మ‌కం కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ లో ఎక్కువ‌ని చెప్పాలి. తెలంగాణ‌ కాంగ్రెస్ పార్టీలో నిత్య అసంతృప్త వాదులుగా ముద్ర‌ప‌డ్డ వీరు.. తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్ష స్థానాన్ని కోరుకుంటున్నారు. అయితే.. పార్టీ అధినాయ‌క‌త్వం మాత్రం వారి ఆశ‌ల్ని నెర‌వేర్చ‌టం లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ బీజేపీ వైపు చూస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న మాట‌లు కూడా అందుకు బ‌లాన్ని ఇచ్చేలా ఉన్నాయి. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌ల్గొండ ఎంపీ స్థానాన్ని త‌న సోద‌రుడు కోమ‌టిరెడ్డి రెడ్డి వెంక‌ట‌రెడ్డి సొంతం చేసుకోవ‌టం ద్వారా ప్ర‌జ‌ల్లో త‌మ‌కున్న ప‌లుకుబ‌డి మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని వారు భావిస్తున్నారు.

తామెంత క‌ష్ట‌ప‌డుతున్నా.. త‌మ‌కు పార్టీలో గుర్తింపు ల‌భించ‌ని నేప‌థ్యంలో పార్టీ మారాల‌ని రాజ‌గోపాల్ బ‌లంగా భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న సోద‌రుడు వెంక‌ట‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ లో కొన‌సాగాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ మారే విష‌యంలో ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంద‌ని స‌మాచారం. దీనికి తోడు ఇటీవ‌ల కాలంలో ఆర్థిక సంబంధ‌మైన అంశాల్లోనూ ఇరువురు సోద‌రుల మ‌ధ్య లెక్క‌లు తేడా వ‌చ్చాయ‌ని.. ఎవ‌రి దారి వారు చూసుకోవాల‌న్న యోచ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇరువురు అన్న‌ద‌మ్ములు ఒకే మాట అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించినంత కాలం తిరుగులేని శ‌క్తిగా ఉన్న వేళ‌.. ఇరువురు వేర్వేరు పార్టీలో ఉండాల‌న్న ఆలోచ‌న రానున్న రోజుల్లో ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తాను పార్టీ మారేది గాలిమాట‌గా కొట్టేస్తున్న‌ప్ప‌టికీ.. కోమ‌టిరెడ్డి సోద‌రులు ఇద్ద‌రు చెరో పార్టీలో ఉండాల‌న్న ప్రాథ‌మిక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. 
Tags:    

Similar News