చిన్నమ్మకు డబుల్ బొనాంజా!

Update: 2017-07-23 17:36 GMT
ప్రస్తుతం పరప్పన అగ్రహారం జైల్లో ఉన్న శశికళ కు డబుల్ బొనాంజా దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇదేమీ ఆర్కే నగర్ ఉపఎన్నిక విజయం , తనను వదిలించుకున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తిరిగి దరికి రావడం వంటి శుభవార్తలేమీ కాదు. ఈ డబుల్ బొనాంజా ఏంటంటే.. ప్రస్తుతం అనుభవిస్తున్న జైలు శిక్షకు అదనంగా మరో అదనపు విడత జైలుశిక్ష కూడా తోడు కావడం. అవును- జైలు అధికారుల్ని ప్రలోభ పెట్టి జైల్లో లగ్జరీ లైఫ్ ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు నిజం అని తేలితే గనుక.. శశికళ ఊచలు లెక్కబెట్టవలసిన కాలపరిమితి ఇంకాస్త ముందుకు సాగుతుందని వార్తలు వస్తున్నాయి.

స్వయంగా- శశికళ జైలు అధికార్లకు రెండు కోట్లు ఇచ్చి.. లగ్జరీలు ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు చేసి, పర్యవసానంగా తానే ట్రాన్స్ ఫర్ అయిపోయిన మహిళా ఐపిఎస్ రూప ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం రూప చేసిన ఆరోపణల మీద దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో ఆరోపణలు నిజమే అని తేలితే, శశికళ ప్రలోభాల ద్వారా సుఖమయ జీవనం ఏర్పాటు చేసుకున్నట్లు నిర్ధరణ అయితే.. మరికొంత కాలం అదనపు శిక్ష పదే అవకాశం ఉన్నదిట.

అయినా ఒకప్పుడు తమిళనాట రాజకీయాల్లో తనదంటూ ఒక శకం నడిపించిన పురట్చి తలైవి జయలలిత.. తిరుగులేని అధికార కేంద్రంగా ఎంతోకాలం చెలరేగారు. ప్రస్తుతం సొంత మనుషులు కూడా వచ్చి కనీసం కలుసుకోవడానికి వీల్లేని..  ఒక పట్టాన అనుమతులు దొరకని రీతిలో జైలు జీవితం గడుపుతున్నారు. తనకు కొన్ని దశాబ్దాలుగా అలవాటైపోయిన వక్ర మార్గాలను ఇక్కడ కూడా ఆచరణలో పెట్టేసరికి అవి కూడా బెడిసికొడుతున్నట్లుంది. జైలు అధికారుల్ని ప్రలోభ పెట్టడానికి ఇచ్చిన డబ్బూ పాయె.. తద్వారా సంక్రమించిన లగ్జరీ వసతులూ పాయె.. అదనంగా.. ఎడిషనల్ జైలు శిక్ష భయం కూడా మొదలాయె.. ఎంతటి ఘోరమైన పరిస్థితి. అవును ఇంతకూ దీనిని డబుల్ బొనాంజా అనాలా..? ట్రిపుల్ బొనాంజా అనాలా? ఏమో మరి!!
Tags:    

Similar News