డిగ్గీరాజాను ఖాతరు చేసిన దిక్కులేదు!

Update: 2015-01-21 06:39 GMT
ఆయన గారు ఢిల్లీ నుండి వస్తున్నారంటే చాలు హైదరాబాద్‌ అంతా... కాంగ్రెస్‌ జెండాలతో నిండిపోయేది, స్వయంగా ముఖ్యమంత్రి అంతటివారే ఎయిర్‌ పోర్ట్‌ కు వెళ్లి మరీ రిసీవ్‌ చేసుకునేవారు! అధికారికంగా ఎటువంటి అధికారంలేకపోయినా ఎర్ర బుగ్గ కారులో రయ్‌ రయ్‌ మంటూ తిరిగేవారు! అటువంటి నేత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్టీని సమీక్షించడానికి వస్తే... ఆయన ముందే నాయకులు బాహాబాహీకి దిగడం, ఆందోళనలకు దిగడం జరిగిపోయాయి! ఆఖరికి స్వయంగా ఆయనగారే దిగివచ్చి... ఆందోళన చేస్తోన్న నాయకులను సముదాయించాల్సిన పరిస్థితి దాపరించింది! ఆయనగారే దిగ్విజయ్‌ సింగ్‌... ఒకప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏలుతున్నప్పుడు... ఆ పార్టీ నాయకులను ఏలిన ఢిల్లీ దూత!

తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలు ఏర్పాటుచేసి, రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పార్టీని బలపరచాలనే మెసేజ్‌ మోసుకొచ్చిన దిగ్విజయ్‌ సింగ్‌ ను ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌ నేతలు ఎవరూ ఖాతరు చేయలేదు! ఆయనగారి ప్రవర్తనలోనూ, హుందాతనంలోనూ, ఆత్మ విశ్వాసంలో కూడా తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది! ఇదే సమయంలో... మేధోమధన సదస్సు కోసం ఎంపిక చేసిన బృందాల్లో సీనియర్లకు చోటు దక్కలేదని పలువురు నేతలు సమావేశం ఆరంభంలోనే దిగ్విజయ్‌ సమక్షంలో ఆందోళనకు దిగడం, ఆయన ముందే చోటా మోటా నేతలు సైతం నానా రభస చేయడం ఆయన లెవెల్‌ గ్రాఫ్‌ ఎలా తగ్గిపోయిందో చెప్పకనే చెప్పాయి! ఈ క్రమంలో సీనియర్లు, నిన్న మొన్నటి వరకూ దిగ్విజయ్‌ సింగ్‌ పక్కన కాకుండా వెనకన నడిచిన నాయకులు కూడా అయన్ను దాటి మాట్లాడటం కొసమెరుపు! ఈ పరిస్థితులన్నీ చూస్తోంటే... డిగ్గీ రాజాగారి తెలుగు రాష్ట్రాల చివరి పర్యటన ఇదే అయినా ఆశ్చర్యం లేదని పలువురు అభిప్రాయపడుతోన్నారు!
Tags:    

Similar News