దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న దిగ్గీ రాజా

Update: 2016-07-23 17:01 GMT
స్టార్ హీరో పేరు మీద రేష‌న్ కార్డు త‌యార‌వ్వ‌డం.. ఏదో మారు మూల ప‌ల్లెటూర్లో ఓ సెల‌బ్రెటీకి ఓటు హ‌క్కు క‌ల్పించ‌డం.. ఇలాంటి చిత్రాలు ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లో చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా మ‌ధ్య ప్ర‌దేశ్ లో ఇలాంటి చిత్ర‌మే జ‌రిగింది. ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇంఛార్జిగా వ్య‌వ‌హ‌రించిన అగ్ర నేత దిగ్విజ‌య్ సింగ్ ను దారిద్ర్య రేఖ‌కు దిగువన ఉన్న వ్య‌క్తిగా గుర్తించింది మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. రాజ‌వంశానికి చెందిన దిగ్గీ.. తిండికి కూడా క‌ష్ట‌ప‌డేవాడిగా నిర్ణ‌యించారు అధికారులు. ఆయ‌నే కాదు.. అత‌డి సోద‌రుల‌తో పాటు మ‌రికొంద‌రు కుటుంబ స‌భ్యుల్ని కూడా ఈ జాబితాలో చేర్చారు.

తాము ప్ర‌తి సంవ‌త్స‌రం ప్ర‌భుత్వానికి ప‌న్ను కూడా క‌డుతున్నామ‌ని.. అలాంటి త‌మ‌ను దారిద్ర్య రేఖ దిగువ‌న ఉన్న‌ట్లు ఎలా చేరుస్తార‌ని.. భాజ‌పా పాలిత రాష్ట్ర ప్ర‌భుత్వం.. కేంద్ర ప్ర‌భుత్వం ఎంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయో చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని దిగ్తీ రాజా ఎద్దేవా చేశారు. ఈ విష‌యంలో త‌న‌కు అధికారులు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఐతే భాజ‌పా నేత‌లు దిగ్గీ రాజా విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్టారు. ఇలాంటి పొర‌బాట్లు మామూలే అని తేలిగ్గా కొట్టి పారేస్తూనే.. దిగ్గీ రాజా మెంట‌ల్లీ పూర్ కాబ‌ట్టే ఆయ‌న్ని దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న ఉన్న‌ట్లు గుర్తించి ఉండొచ్చంటూ రిటార్ట్ ఇచ్చారు. మ‌రోవైపు దిగ్గీ రాజా కావాల‌నే త‌న‌కు తాను దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న వచ్చేలా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారంటూ ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి.
Tags:    

Similar News