జనాభిప్రాయం అంటే కాంగ్రెస్‌ నేతల్లో భయం!

Update: 2015-10-30 15:36 GMT
తమ అభిప్రాయమే జనాభిప్రాయంగా వ్యక్తం కావాలని సాధారణంగా రాజకీయ నాయకులకు ఒక కోరిక ఉంటుంది. ప్రజలందరూ తమ మనసెరిగి తమ తలపోస్తున్న విషయాన్నే ఇష్టపడాలని కోరుకుంటారు. కానీ, అన్నిసందర్భాల్లోనూ అలా జరగదు. పాపం తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది.

వరంగల్‌ ఎంపీ అభ్యర్థి ఎంపికకు వారి నిర్ణయం ఏదో వారు తీసుకున్నారు. జి.వివేక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దపల్లి వీడి వచ్చేది లేదని తేల్చేసిన తర్వాత.. వారు సర్వే సత్యనారాయణను బరిలో దించాలని డిసైడ్‌ అయ్యారు. కాకపోతే.. ఈ నిర్ణయానికి కార్యకర్తలతో మమ అనిపించే ఉద్దేశంతో సాక్షాత్తూ రాష్ట్ర పరిశీలకుడు డిగ్గీ రాజా హైదరాబాదుకు వచ్చి అభిప్రాయాలు సేకరించారు. వారి అభీష్టానికి వ్యతిరేకంగా కార్యకర్తల మనోభావం వ్యక్తమైంది. మెజారిటీ మంది మాజీ ఎంపీ రాజయ్యకే టికెట్‌ ఇవ్వాలని సూచించారు.

అయితే కార్యకర్తల అభిప్రాయం, జనాభిప్రాయం రాజయ్య వైపు మొగ్గుతున్నప్పటికీ.. అందుకు పార్టీ నాయకత్వం జడుసుకుంటున్నదని సమాచారం. సర్వే సత్యనారాయణ కేండేటు అయితే.. పార్టీ గానీ, ఇతర నాయకులు గానీ డబ్బు సమకూర్చే అవసరం లేదని, అలా కాకుండా రాజయ్య అభ్యర్థి అయితే.. ఎన్నికల ఖర్చు మొత్తం పార్టీలోని సీనియర్‌ నాయకుల మీద భారంగా పడుతుందని వారు భయపడుతున్నారుట. రాజయ్య అసలే గత ఎన్నికల్లో ఓడిపోయి.. ఆర్థికంగా చితికిపోయి ఉన్నానని పార్టీ నిధులు కూడా సమకూరిస్తే తప్ప.. పోటీచేయలేనని అంటున్నట్లు సమాచారం. కానీ ప్రజలు మాత్రం ఆయననే కోరుకుంటున్నారు. ఆర్థిక భారం తప్పించుకోవడానికి సర్వేను చేస్తే పోతుందని పార్టీ అనుకుంటున్నది. ఇన్ని సంక్లిష్టతల మధ్య వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News