దుకాణ్‌బంద్‌ అవుతుందంటున్న ఢిల్లీ చిలక!!

Update: 2015-01-21 04:08 GMT
చిలక జోస్యం చెప్పే చిలక చాలా స్వేచ్ఛ అనుభవిస్తున్నట్లు లెక్క. ఎందుకంటే.. అది తనకు తోచిన కార్డును లాగి తిరిగి తన బోనులోకి వెళుతుందే తప్ప.. యజమాని చెప్పిన మాటను తిరిగి వల్లించదు. అదే రాజకీయాల్లో.. ప్రత్యేకించి కాంగ్రెసు పార్టీలోని రాజకీయ చిలకలు మాత్రం.. అధిష్ఠానం అప్పగించిన మాటలను రాష్ట్రాల వద్దకు వచ్చి వల్లిస్తూ మనుగడ సాగిస్తుంటాయి. అదే క్రమంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోను కాంగ్రెస్‌ సముద్ధరణకు కసరత్తులు ప్రారంభించినట్లుగా కనిపిస్తున్న ఢిల్లీ దూత దిగ్విజయసింగ్‌.. చిలకపలుకులు పలుకుతున్నారు. కేవలం పలుకులే కాదు.. ఇప్పుడున్నట్లే ఇకముందు కూడా వ్యవహరిస్తే.. తెలంగాణలో (కూడా) కాంగ్రెస్‌పార్టీ దుకాన్‌ బంద్‌ అవుతుందని ఆయన జోస్యం చెబుతున్నారు.

తెలుగురాష్ట్రాన్ని చీల్చిన పుణ్యమాని ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ సర్వనాశనం అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలో చెప్పుకోవడానికి కొన్ని సీట్లు సాధించారు గానీ.. వాటిని కూడా తెరాస చేతుల్లో పెట్టేశాలా ఇప్పుడు రాజకీయ మార్పుచేర్పులు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేల నుంచి సర్పంచుల వరకు కాంగ్రెసుకు చెందిన అనేకమంది తెరాస తీర్థం పుచ్చుకోవడం జరుగుతోంది. వెళ్లదలచుకున్న వారిని నియంత్రించగల సత్తా గల నాయకుడు తెలంగాణ పార్టీ నాయకత్వంలో ఒక్కరు కూడా లేకపోవడం.. ఆ పార్టీకి పెద్ద లోటు. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ... పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తెలంగాణలో పార్టీని మూసేసుకోవాల్సి వస్తుందని డిగ్గీ హెచ్చరించారు.

పండగకు వచ్చి వెళ్లే అల్లుడిలాగా.. ఇంతకాలానికి సమీక్షిస్తానంటూ వచ్చిన ఢిల్లీ చిలక దిగ్విజయసింగ్‌.. ఎన్ని సూచనలైనా చేయవచ్చు గాక.. అలా చేస్తే ఇలాచేస్తే పార్టీ దివ్యంగా ఉంటుందని భ్రమలు కల్పించవచ్చు గాక... పార్టీ నాయకులు ఫిరాయించకముందే వారిని అడ్డుకుని ఉండాల్సినదంటూ నీతులు వల్లించి ఉండవచ్చు గాక... కానీ ఆ పనులేవీ ఆచరణలో సాధ్యం కాలేదని ఆయనకు తెలియకుండా ఉండకపోదు. నేతలు పార్టీ మారుతున్నారనే సమయంలో ఆయనే స్వయంగా ఎందుకు వచ్చి వారిని నియంత్రించే ప్రయత్నం చేయలేదో... అడిగితే ఆయన మొహం ఎక్కడ దాచుకుంటారో తెలియదని కాంగ్రెస్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టం జరుగుతున్నంత సేపూ ఢిల్లీనుంచి చూస్తూ కూర్చుని.. ఇప్పుడొచ్చి.. నివారించలేకపోయారంటూ నీతులు వల్లించడం కరెక్టు కాదని అంటున్నారు.

Tags:    

Similar News