రేవంత్ ఆతృత‌కు డిగ్గీ బ్రేకులు వేశాడుగా

Update: 2017-06-02 04:59 GMT
పొత్తుల ద్వారా తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని ప్ర‌య‌త్నించిన తెలుగుదేశం పార్టీలో ఆదిలోనే చుక్కెదురు అయింది. టీటీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ తో పొత్తుకు తాము సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ జైపాల్‌ రెడ్డి రియాక్ట్ అవుతూ తాము సైతం రెడీ అన్నారు. అయితే దీనికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి - కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి దిగ్విజయ్‌ సింగ్ బ్రేకులు వేశారు. టీటీడీపీతో పొత్తు అంశంపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ జైపాల్‌ రెడ్డి ఏమన్నారో త‌న‌కు తెలియదని అన్నారు.  ``ఏపీలో టీడీపీని వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం అసంబద్ధం`` అని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ ఉత్సాహానికి కాంగ్రెస్ బ్రేకులు వేసిన‌ట్ల‌యింద‌ని చెప్తున్నారు.

రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌ కు వచ్చిన దిగ్విజయ్‌ సింగ్ గాంధీభవన్‌ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దిగ్విజయ్‌ సింగ్‌ విమర్శించారు. మియాపూర్‌ భూకుంభకోణంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాత్ర ఉందని ఆయ‌న‌ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొందరు సబ్‌రిజిస్ట్రార్లను బదిలీ చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ పై తమకు విశ్వాసం లేదని.. భూకుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి తలసాని రాజీనామా చేయాలన్నారు.

రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమతో చర్చకు రావాలని దిగ్విజ‌య్ సింగ్ స్ప‌ష్టం చేశారు. తాము ప్రధానితో చర్చల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ప‌రిపాల‌న విష‌యంలో బీజేపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఒప్పుకునేది లేదని దిగ్విజ‌య్ సింగ్‌ అన్నారు. రిజర్వేషన్ల వల్ల ముస్లింల సంఖ్య పెరుగుతుందని ప్రచారం చేయడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News