ఈసీకి లంచం కేసులో దిన‌క‌ర‌న్ కు ఊర‌ట‌!

Update: 2017-07-14 10:31 GMT
ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ముడుపులు ఇవ్వ‌జూపార‌న్న ఆరోప‌ణ‌ల‌పై శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్  అరెస్టై బెయిలుపై విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఈసీకు రూ. 50 కోట్లు ఎరవేశారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయ‌న‌పై కేసు నమోదు చేశారు. నెల రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న దినకరన్ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు.

అయితే, ఈ మొత్తం వ్య‌వ‌హారం ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. అస‌లు దిన‌క‌ర‌న్ కు  ఈ కేసుకు సంబంధం లేద‌ని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆశ్చ‌ర్య‌క‌ర ప్ర‌క‌ట‌న చేశారు. దినకరన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టులో నివేదిక సమర్పించారు. ఈ కేసు నుంచి దిన‌క‌ర‌న్ పేరును తొల‌గించారు. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన చార్జ్ షీట్ లో టీటీవీ దినకరన్ పేరు లేదన్న సంగ‌తి శుక్రవారం వెలుగులోకి వ‌చ్చింది.

ఈ  కేసులో శశికళ మేనల్లుడు దినకరన్ తో స‌హా ఆయన సన్నిహితుడు మల్లికార్జున - మీడియేటర్ సుఖేష్ చంద్రశేఖర్ తదితరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. దినకరన్ దెబ్బకు చెన్నై నగరంలోని ఆర్ కే నగర ఉప ఎన్నికలు కూడా రద్దు అయ్యాయి. ఈ కేసు నుంచి దినకరన్ కు విముక్తి కలగడంతో ఆయన అనుచరులు పండగ చేసుకుంటున్నారు.
Tags:    

Similar News