ఆ ప్రాజెక్టుకు ఆయ‌న పేరు పెడ‌తార‌ట‌

Update: 2017-05-06 06:33 GMT
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇరిగేష‌న్ వ్య‌వ‌హారాలకు సంబంధించిన విష‌యం ఏదైనా స‌రే.. తెర మీద‌కు వ‌చ్చిన వెంట‌నే గుర్తుకు వ‌చ్చే వ్య‌క్తి సాగునీటి రంగ స‌ల‌హాదారుగా తెలంగాణ రాష్ట్రానికి స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన ఆర్ విద్యాసాగ‌ర్ రావు. తీవ్ర అనారోగ్యంతో ఇటీవ‌ల మ‌ర‌ణించిన ఆయ‌న‌కు స‌ముచిత గౌర‌వం ఇవ్వాల‌ని.. ఆయ‌న పేరును తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు త‌ర‌త‌రాలు గుర్తుంచుకునే రీతిలో తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యాల్ని తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

న‌ల్గొండ జిల్లాలో చేప‌ట్టిన డిండి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ఆయ‌న పేరు పెట్టాల‌ని ప్ర‌భుత్వం సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వుల‌ను త్వ‌ర‌లోనే జారీ చేయ‌నున్న‌ట్లుగా స‌మాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం నీటిపారుద‌ల ప్రాజెక్టుల రీ ఇంజ‌నీరింగ్‌.. కొత్త ప్రాజెక్టుల రూప‌క‌ల్ప‌న‌లో విద్యాసాగ‌ర్ రావు విశేష‌మైన సేవ‌లు అందించారు. ఇరిగేష‌న్ రంగానికి విద్యాసాగ‌ర్ రావు చేసిన కృషిని దృష్టిలో పెట్టుకొని.. ఆయ‌న పేరు మీద ఒక ప్రాజెక్టుకు ఆయ‌న పేరు పెట్టాల‌న్న నిర్ణ‌యాన్ని సీఎం కేసీఆర్ వెల్ల‌డించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఆయ‌న సంస్మ‌ర‌ణ స‌భ‌లో ప్ర‌భుత్వం ఇందుకు సంబంధించిన నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదే స‌మ‌యంలో జ‌ల‌సౌధ‌లోని అలీ న‌వాబ్ జంగ్ బ‌హ‌దూర్ విగ్ర‌హం ప‌క్క‌న విద్యాసాగ‌ర్ రావు కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేష‌న్ రంగానికి విద్యాసాగ‌ర్ రావు చేసిన కృషిని తెలంగాణ ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా చేయాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News