నేరుగా సినిమా చూపించక ఈ ట్రైలర్ అవసరమా లోకేశ్?

Update: 2022-08-17 04:47 GMT
సినిమాకు.. రాజకీయాలకు పోలిక ఉండదు. ఒక సినిమా విడుదలకు ముందు ఫస్ట్ లుక్ మొదలు.. ప్రీరిలీజ్ ఫంక్షన్ వరకు బోలెడన్ని దశలున్న పరిస్థితి. అలాంటి సినిమా తెలివిని రాజకీయాల్లో వినియోగిస్తే కొత్త కష్టాలు వచ్చే వీలుంది. లేదంటే.. ప్రత్యర్థులు మరింతగా ప్రిపేర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే.. అనుకున్నది జరగకపోగా.. ఎదురుదెబ్బ బలంగా పడే ప్రమాదం ఉంటుంది. ఇదంతా ఎందుకంటే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నోటి నుంచి వచ్చిన మాటలే అని చెప్పాలి.

తాజాగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక పెద్ద కుంభకోణాన్ని వచ్చే వారం బయటపెట్టబోతున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. అదేమిటి? అన్న వివరాల్నివెల్లడించకుండానే ఈ సంచలన వ్యాఖ్య చేశారు. దీంతో..

వచ్చే వారం లోకేశ్ బయటపెట్టే భారీ స్కాం ఏమిటన్నది ఇప్పుడు చర్చగా మారింది. సినిమాలకు హైప్ క్రియేట్ చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది. రాజకీయాల్లో ఇలాంటి హైప్ లతో ప్రయోజనం కంటే కూడా కొన్నిసార్లు ప్రమాదాలే ఎక్కువగా జరిగే వీలుంది.

ప్రత్యర్థులు ప్రిపేర్ అయ్యే దానికి అవకాశం ఇచ్చేలా లోకేశ్ మాటలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా మంగళగిరిలో లోకేశ్ తన సొంత ఖర్చులతో ఆరోగ్య సంజీవని కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావిస్తూ.. పదో తరగతి పాస్.. డిగ్రీ ఫెయిల్ అయిన తెలివితేటలు జగన్మోహన్ రెడ్డివి అంటూ ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల కంటే కూడా ఏపీ నుంచి వెళ్లిపోయిన కంపెనీలే ఎక్కువన్నారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతన్న చర్చే జరుగుతుందన్నారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. జగన్ రెడ్డికి టైమప్ అయిపోయి ఇంటికి వెళ్లే పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా దాదాపు 500 హామీల్లో మాట తప్పి..

మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గ వర్గాల్లో గెలిపించాలా? అని ప్రశ్నించారు. ఇదంతా బాగానే ఉన్నా.. వచ్చే వారం లోకేశ్ బయటపెట్టనున్న జగన్ కు చెందిన భారీ స్కాం ఏమిటన్నదిఆసక్తికరంగా మారింది. ముందే తాను బయటపెట్టే సంచలనం గురించి చెప్పేసిన నేపథ్యంలో.. అసలు విషయం బయటకు వచ్చే వేళకు.. ధీటైన కౌంటర్ ఇచ్చేందుకు జగన్ అండ్ కో సిద్ధమవుతారన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News