కోజికోడ్ విమాన ప్రమాదం..అధికారుల చేతుల్లో బ్లాక్‌ బాక్స్‌ !

Update: 2020-08-08 13:00 GMT
కేర‌ళ‌లో జ‌రిగిన ఘోర విమాన ప్రమాదంలో 20 మంది ఇప్పటివరకు మృతిచెందారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. అలాగే నేటి ఉద‌యం డైర‌క్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ అధికారులు ఎయిర్ ఇండియా విమాన బ్లాక్‌ బాక్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. విమానం నుంచి డిజిట‌ల్ ఫ్ల‌యిట్ డేటా రికార్డ‌ర్ , కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా .. విమాన ఎత్తు, స్థితి, వేగం, అలాగే పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను వినవచ్చు. దీనితో అసలు ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చు.

మరోవైపు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి హరదీప్ పురీ కోజికోడ్ చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం పౌర విమానయాన శాఖ అధికారులు, నిపుణులతో సంప్రదింపులు జరపనున్నారు. దుబాయి నుంచి కోజికోడ్‌కు వస్తున్న ఎయిరిండియా విమానం రన్‌ వే పై అదుపు తప్పడంతో విమానం రెండు ముక్కలైంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 100మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ గర్భిణి, నలుగురు చిన్నారులు సహా 23 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

ఇకపోతే, ఈ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఎయిరిండియా ప్రత్యేక సహాయ బృందం ఇప్పటికే కోళీకోడ్‌ కు చేరుకుంది. ‘ఏంజిల్స్ ఆఫ్ ఎయిర్ ఇండియా’ అని పిలువబడే ప్రత్యేక సహాయ బృందాన్ని ఢిల్లీ, ముంబై నుంచి కోళీకోడ్ ‌కు పంపించినట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. కాగా ప్రమాదానికి కారణం టేబుల్‌ టాప్‌ రన్‌ వేనే కారణమని తెలిపింది. కేరళలో భారీ వర్షాల కారణంగా విమానం ల్యాండింగ్‌ సమయంలో రన్‌వే పై తడిగా ఉండటంతో విమానం ఓవర్‌ షాట్‌ అయ్యి జారి లోయలో పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు మంటలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Tags:    

Similar News