రోజా.. రాజా.. పదవుల తొలగింపు అందుకేనా?

Update: 2021-07-18 23:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నామినేటెడ్ ప‌ద‌వుల కోలాహ‌లం ముగిసింది. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి స‌మ‌న్యాయం చేసేశారు జ‌గ‌న్‌. సామాజిక వ‌ర్గాల వారీగా బేరీజు వేసి ప‌ద‌వుల‌ను పంచేశారు. దీంతో.. రాష్ట్రంలో కోలాహ‌లం నెల‌కొంది. అయితే.. ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌యం కూడా ఒక‌టుంది. కొంద‌రికి ఖాళీగా ఉన్న ప‌ద‌వులు ఇస్తే.. మ‌రికొంద‌రికి ఉన్న‌వారిని తొల‌గించి ఇచ్చారు. దీంతో.. వారి ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది.

నామినేటెడ్ ప‌ద‌వుల్లో సాధార‌ణ‌మైన‌వి నుంచి కేబినెట్ ర్యాంకు స్థాయిగా భావించే ప‌ద‌వుల వ‌ర‌కూ ఉన్నాయి. అలాంటి వాటికి చైర్మ‌న్లుగా ఉన్న‌వారిని తొల‌గించి, మ‌రీ కొత్త‌వారికి ఇచ్చారు. ఉదాహ‌ర‌ణ‌కు రాష్ట్రంలో కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌క్కంపూడి రాజా ఉన్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా రాజాన‌గ‌రం ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న‌.. కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఆ ప‌ద‌వి నుంచి రాజాను తొల‌గించారు. ఆ ప‌ద‌విని అడ‌పా శేషుకు క‌ట్ట‌బెట్టారు.

అదేవిధంగా.. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజాను సైతం ఏపీఐఐసీ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తొల‌గించారు. న‌గ‌రి నియోజ‌కవ‌ర్గ ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీలో కీ రోల్ ప్లే చేశారు. 2014 ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ఎమ్మెల్యే గెలిచారు. ఇలా రెండు సార్లు గెలిచిన ఆమెను మంత్రివ‌ర్గంలోకి తీసుకోలేదు జ‌గ‌న్‌. ప్ర‌తిగా.. ఏపీఐఐసీ చైర్మ‌న్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేశారు. అయితే.. ఇప్పుడు ఆ ప‌ద‌విని కూడా తీసేశారు. మెట్టు గోవింద రెడ్డికి ఆ సీటులో కూర్చోబెట్టారు. ఇంకా ప‌లువురి విష‌యంలోనూ ఇదేవిధంగా చేశారు. అయితే.. ఒక‌రికి రెండు ప‌ద‌వులు ఉండొద్ద‌నే కాన్సెప్టుతోనే ఎమ్మెల్యేల ప‌రిధిలో ఉన్న‌ చైర్మ‌న్ ప‌ద‌వులు తొల‌గించార‌నే చ‌ర్చ సాగుతోంది. కానీ.. వాస్త‌వం మ‌రో విధంగా ఉంద‌ని అంటున్నారు.

రాష్ట్రంలో రెండో విడ‌త మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌ని ఎప్ప‌టి నుంచో చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేల్లో.. మంత్రివ‌ర్గంలో స్థానం ఆశించిన‌ వారి సంఖ్య వంద మందికిపైనే ఉంది. కానీ.. మొద‌టి విస్త‌ర‌ణ‌లో పాతిక‌ మందితో కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌. అయితే.. ఆశావ‌హులు అంద‌రినీ సైలెంట్ గా ఉంచడానికి ఈ కేబినెట్ వ‌య‌సు రెండున్న‌రేళ్లు మాత్ర‌మే అని చెప్పారు. ఆ త‌ర్వాత మిగిలిన వారికి ఛాన్స్‌ ఇస్తా అని చెప్పారు. దీంతో.. ఆశావ‌హులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు.

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టి రెండున‌రేళ్లు కావ‌స్తోంది. దీంతో.. రెండో విడ‌త మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌బోతున్నార‌నే చ‌ర్చ మొద‌లైంది. గ‌డిచిన రెండు మూడు నెల‌లుగా ఈ డిస్క‌ష‌న్ తార‌స్థాయికి చేరింది. ఇప్పుడు ఉన్న‌ట్టుండి నామినేటెడ్ ప‌ద‌వులు భ‌ర్తీ చేయ‌డంతో నెక్స్ట్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణే అని అంటున్నారు. నామినేట్ భ‌ర్తీ మాత్ర‌మే కాకుండా.. ప‌లువురు ముఖ్యులైన‌ ఎమ్మెల్యేల ప‌రిధిలో ఉన్న కార్పొరేష‌న్ల‌ను సైతం తొల‌గించ‌డంతో కేబినెట్ విస్త‌ర‌ణ కన్ఫామ్ అని భావిస్తున్నారు.

ఎమ్మెల్యే రోజాకు మొద‌టి విస్త‌ర‌ణ‌లోనే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని చాలా మంది భావించారు. కానీ.. ఆమెకు అవ‌కాశం రాలేదు. వైసీపీ విప‌క్షంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు సర్కారుతో ఆమె ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా పోరాటం సాగించారు. అలాంటి నేత‌కు మంత్రిప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతో.. రెండో ద‌ఫా ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని భావించారు. ఇప్పుడు ఆమె వ‌ద్ద ఉన్న ఏపీఐఐసీ చైర్మ‌న్ పోస్టు వెన‌క్కి తీసుకోవ‌డంతో.. జ‌ర‌గ‌బోయే విస్త‌ర‌ణ‌లో త‌ప్ప‌కుండా కేబినెట్లోకి తీసుకుంటార‌నే చ‌ర్చ సాగుతోంది.

ఇటు జ‌క్కంపూడి రాజా సైతం కాపు సామాజిక వ‌ర్గం నుంచి బ‌ల‌మైన నేత అని చాటుకున్నారు. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఈయ‌న కూడా గ‌ళం వినిపించారు. ఇప్పుడు ఈయ‌న కార్పొరేష‌న్ కూడా వెనక్కి వెళ్లిపోవ‌డంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బెర్త్ క‌న్ఫామ్ అని అంటున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News