త‌ట‌స్థం వెనుక ప‌వ‌న్ వ్యూహం అదేనా?

Update: 2017-08-18 04:24 GMT
ప్ర‌శ్నిస్తా అన్నాడు. కానీ.. కామ్ గా ఉన్నాడు. అదేమిటంటే.. వ్యూహం అంటాడు. స‌మ‌స్య‌ల‌పై వెన‌క్కి త‌గ్గేది లేదంటాడు. ఎలాంటి నిర‌స‌నకైనా సిద్ధ‌మంటాడు. అదే స‌మ‌యంలో పాద‌యాత్ర‌లు లాంటివి చేయ‌టం సాధ్యం కాద‌ని చెప్పేస్తుంటాడు. ఇలా. త‌న మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య అంత‌రం అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఇదంతా ఎవ‌రి గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దేమో. ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది. నిజ‌మే.. ఇప్ప‌టివ‌ర‌కూ చెప్పిందంతా ప‌వ‌ర్ స్టార్ గా.. జ‌న‌సేన అధినేత‌గా సుప‌రిచితుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించే. చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు మ‌ధ్య అంత‌రం అంత‌కంతకూ పెరిగిపోతున్న వైనం స్ప‌ష్టంగా కనిపిస్తోంది.

పేరుకు వ్యూహాత్మ‌క‌మంటూ త‌ప్పించుకునే దిశ‌గా వేస్తున్న ప‌వ‌న్ రాజ‌కీయ అడుగులు కొత్త కొత్త వాద‌న‌లు వినిపించేలా చేస్తోంది. రాజ‌కీయాల్ని మార్చేస్తాన‌ని ఒక‌ప్పుడు త‌న అన్న చిరంజీవి ప్ర‌జారాజ్యం పేరుతో చేసిన రాజ‌కీయాల‌కు త‌గ్గ‌ట్లే త‌మ్ముడి జ‌న‌సేన రాజ‌కీయాలు కూడా ఉంటున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

క్రియాశీల రాజ‌కీయాల్లో ముందుండి మ‌రీ న‌డిపిస్తాన‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని చ‌క్క‌దిద్ద‌ట‌మే ల‌క్ష్య‌మ‌న్న చిరంజీవి.. అదే ప్ర‌జ‌ల‌కు ఎంత ద‌గ్గ‌ర‌గా ఉన్నారో తెలిసిందే. ఈ విష‌యంలో ప‌వ‌న్ తీరు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అన్న‌కు మించి మ‌రీ దూరంగా ఉండ‌టం ప‌వ‌న్‌ కు మాత్ర‌మే చెల్లింద‌ని చెప్పాలి.

ప్ర‌త్యేక హోదా మీద ఏదో చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. కొన్ని నెల‌లుగా ఆ విష‌యాన్ని  ప‌ట్టించుకున్న‌ది లేదు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌స్తావించిన ప‌లు కార్య‌క్ర‌మాల సంగ‌తే చూస్తే.. ఏ విష‌యం మీదా ఆయ‌న చివ‌రికంటా నిల‌బ‌డిన‌ట్లుగా క‌నిపించ‌దు. ఉద్దానం ఇష్యూ ఇందుకు మిన‌హాయింపుగా చెప్పొచ్చు. అదొక్క‌టి మిన‌హా మిగిలిన  ఏ అంశం మీదా ప‌వ‌న్ గ‌ట్టిగా నిల‌బ‌డి పోరాటం చేసిన‌ట్లుగా క‌నిపించ‌దు.

ఇదిలా ఉంటే.. తాజాగా జ‌రుగుతున్న నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాత్ర ఎలా ఉంటుంద‌న్న ఆస‌క్తి నెల‌కొంది. భూమా కుటుంబంతో ప‌వ‌న్ కు ఉన్న అనుబంధం నేప‌థ్యంలో.. ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఆయ‌న వ‌స్తార‌ని ఆశించారు. కానీ.. అందుకు భిన్నంగా తాను నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌ట‌స్థ పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేస్తున్నారు. ప‌వ‌న్ నిర్ణ‌యం వెలువ‌డిన వెంట‌నే కొంద‌రు చేసిన విశ్లేష‌ణ ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.. విప‌త్తు నివార‌ణ అంశంలోనూ.. ఏదైనా స‌మ‌స్య ఎదురైతే.. దాన్ని ఎదుర్కొనేందు కంటే కూడా.. ప‌క్క‌కు త‌ప్పుకునే ధోర‌ణి క‌నిపిస్తుంద‌ని చెబుతున్నారు. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా అన్న‌య్య చిరులోనూ.. త‌మ్ముడు ప‌వ‌న్ లోనూ ఉన్న కామ‌న్ పాయింట్ ను ప్ర‌స్తావిస్తున్నారు.

చిరుప్ర‌జారాజ్యంపార్టీని పెట్టిన కొత్త‌ల్లో ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉప ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటూ నిర్ణయం తీసుకున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న ప్ర‌భావం ఉంటుంద‌ని.. అలాంట‌ప్పుడు ఉప ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌టం ద్వారా.. లెక్క తేడా వ‌స్తే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌ది చిరు భావ‌న‌గా అప్ప‌ట్లో చెప్పారు. రాజ‌కీయ సిద్ధాంత ప‌రంగా అన్న దారికి.. త‌న దారికి మ‌ధ్య‌న వ్య‌త్యాసం ఉంద‌ని.. అందుకే తాను సొంతంగా పార్టీ పెట్టిన‌ట్లు చెబుతారు. మ‌రి.. అన్న‌య్య రాజ‌కీయ బాట‌ను త‌ప్పు ప‌ట్టిన త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అన్న మాదిరే రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల్లో అన్న‌లానే వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం.

నంద్యాల ఉప ఎన్నిక‌లో త‌ట‌స్థ వైఖ‌రిని వినిపించ‌టం ద్వారా.. ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌న మీద ప‌డ‌కుండా ఉండేందుకే ప‌వ‌న్ త‌ట‌స్థ స్టాండ్‌ ను ఎన్నుకున్నార‌ని చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌న స్టాండ్ ప్ర‌క‌టించిన త‌ర్వాత తుది ఫ‌లితం లెక్క తేడా వ‌స్తే.. పార్టీ ఇమేజ్ దెబ్బ తింటుంద‌ని.. అంతిమంగా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇబ్బందిగా మారుతుంద‌న్న భావ‌న‌తోనే త‌ట‌స్థ స్టాండ్ తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. గెలుపు.. ఓట‌మిల‌ను ప‌క్క‌న పెడితే.. ఎన్నిక‌ల గోదాలోకి దిగేందుకు ఆచితూచి వేస్తున్న అడుగులతో లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే.. త‌న ప్ర‌తి చ‌ర్య‌లోనూ క్లారిటీ మిస్ అయినట్లుగా క‌నిపించ‌టం.. పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించేలా ప‌ని చేయ‌టం.. అన్నింటికి మించి అన్న బాట‌లో న‌డిచిన‌ట్లుగా ఉండటం ఏ మాత్రం బాగోలేద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News