దిశ తొమ్మిది నెలలు ...?

Update: 2022-04-30 11:35 GMT
దిశ చట్టాన్ని ఇప్పటికి మూడేళ్ళ నాడు  ఆర్భాటంగా ఏపీ సర్కార్ తయారు చేసింది. దాన్ని కేంద్రానికి పంపిస్తే కొర్రీలు పడ్డాయి. మళ్లీ రూపొందించి పంపారు. అయితే ఇప్పటికీ దాని సంగతి అన్నది ఏమీ  తెలియదు. కానీ వైసీపీ నేతలు మంత్రులు మాత్రం తెల్లారిలేస్తే దిశ చట్టాన్ని గట్టిగా వల్లె వేస్తారు. ఏపీలో అబలలకు అతి పెద్ద రక్షణ కవచంగా దాన్ని చెబుతూ ఉంటారు.

దిశ యాప్ ని లక్షలలో నమోదు చేసుకున్నారని, ఇప్పటికి తొమ్మిది వందల మంది దాకా మహిళలను ఈ యాప్ ద్వారా రక్షించామని కూడా ప్రకటిస్తూంటారు. నిజానికి దిశ చట్టం ప్రకారం చూస్తే చాలా స్పీడ్ గా నేర పరిశోధన జరిగి నిందితుడికి కేవలం 21 రోజుల్లోనే ఉరి శిక్ష పడుతుంది అన్నది పొందుపరచారు.

ఇవన్నీ ఇలా ఉంటే దిశ చట్టం రాక ముందు సంగతేమో కానీ వచ్చాక మరిన్ని నేరాలు ఏపీలో పెరిగాయని అంటున్నారు. దానికి కారణం దిశ గురించి ఎంతలా ఊదరగొడుతున్నా నేరాల అదుపు విషయంలో సరైన నిఘా లేకపోవడంతో పాటు యధా ప్రకారం అనేక కేసులలో పోలీసుల  నిర్లక్ష్యమే కనిపిస్తోంది.

అయితే దీనికి హోం మంత్రి తానేటి వనిత చెబుతున్నది ఏంటి అంటే కేసులు గతం కంటే పెరగడానికి కారణం తమ మీద జనాలకు నమ్మకం ఉండడమే అంటున్నారు. గతంలో దిశ యాప్ లేదు, పట్టించుకునే వారే లేరు. ఇపుడు దిశ చట్టం మీద అవగాహన పెరిగింది కాబట్టి మహిళలు ధైర్యంగా ఫిర్యాదులు చేయడానికి ముందుకు వస్తున్నారు అని అంటున్నారు.

అయితే ఇది లాజిక్ కి అంతలా కుదిరే మాటగా లేదు అనే చెప్పాలి. ఎంతలా చైతన్యం వచ్చినా మరీ ఎక్కువగా  కేసులు ఎందుకు పెరుగుతాయి. అంటే నేరాలు ఎప్పటికపుడు పెరుగుతున్నాయన్న దాన్ని ఇండైరెక్ట్ గా ఎవరైనా అంగీకరించి తీరాల్సిందే.  అదే సమయంలో దిశ ప్రచారం దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదని పెదవి విరిచే వారే ఉన్నారు. విపక్షాలు కూడా అదే చెబుతున్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే గుంటూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్ధిని రమ్య దారుణ హత్య కేసులో మొత్తానికి నిందితుడికి ఉరి శిక్ష ఖరారు అయింది. ఈ కేసుని ప్రత్యేక కోర్టు ద్వారా విచారించారు. అయితే నిందితుడిని సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో వెంటనే పోలీసులు గుర్తించారని, చార్జిషీట్ కూడా తొందరగా వేసి అంతా ఫాస్ట్ గా చేయడం వల్లనే శిక్ష పడిందని హోం మంత్రి తానేటి వనిత చెబుతున్నారు.

ఈ కేసు దిశ చట్టం విజయం అని కూడా ఆమె చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఎంత ఫాస్ట్ గా కేసు అనుకున్నా నిందితుడికి శిక్ష పడడానికి తొమ్మిది నెలలు సమయం పట్టింది. అంటే దిశ చట్టం స్పూర్తి అని ఎలా చెప్పాలన్నదే ఇక్కడ ప్రశ్న. దిశ చట్టం ప్రకారం చూస్తే అన్నీ ఫాస్ట్ గా  చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే శిక్ష పడేలా చూడాలని అనుకున్నారు.

కానీ ఈ కేసు విషయంలో తొమ్మిది నెలలు పట్టింది. అయితే ఇక్కడ మరో పోలిక కూడా తెస్తున్నారు. నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడడానికి ఏడేళ్ళు పట్టిందని, ఈ కేసు విషయంలో మాత్రం కేవలం తొమ్మిది నెలలు అంటే విజయమే అన్నది వైసీపీ నేతల వాదన. మొత్తానికి చూస్తే దిశ చట్టం బలంగా పనిచేసిందని అధికార పార్టీ అంటూంటే గత మూడేళ్ళలో ఏపీలో వరసగా జరిగిన మిగిలిన ఎనిమిది వందల బాధిత మహిళల కేసుల్లో ఈ దిశ స్పూర్తి పనిచేయడంలేదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

మొత్తానికి మూడేళ్ళుగా ఏపీలో మహిళల మీద అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ పెద్ద ఎత్తున జరిగాయి. అయితే వాటిలో ఎంత వరకు ప్రభుత్వం చర్యలు తీసుకుందో. ఎంత మేరకు అవి అదుపులో ఉన్నాయో కళ్ళెదుట ఉనన్  గణాంకాలు చూస్తే ఎవరికైనా చాలా బాగా  తెలుస్తుంది. ఆ సంగతి పక్కన పెడితే దిశ చట్టం స్పూర్తి అని చెప్పుకోవడం మాత్రం అతి గా ఉందనే అంటున్నారు. దిశ పేరుతో  రాజకీయం చేయకుండా చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉంది. అలాగే ఈ చట్టాన్ని ఆమోదింపచేసుకోవాలి. అపుడు ఏమి గొప్పలు చెప్పుకున్నా అర్ధం ఉంటుంది అంటున్నారు.
Tags:    

Similar News