హైదరాబాదీలకు గ్రేట్ న్యూస్

Update: 2016-03-17 07:35 GMT
డిస్నీ.. ఈ పేరు చెబితే చాలు చిన్నపిల్లలు కుదురుగా ఉండలేరు. ఆ సంస్థ చిన్న పిల్లల కోసం ఎంతెంత చేసిందో.. ఎన్ని లక్షల కోట్ల మార్కెట్ సృష్టించిందో.. కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక కాలిఫోర్నియాలో ఆ సంస్థ నెలకొల్పిన డిస్నీ ల్యాండ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు ఎంత మక్కువో అందరికీ తెలిసిందే. దీనికి ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్యారిస్ - హాంకాంగ్ - షాంఘై - టోక్యో నగరాల్లో సైతం డిస్నీ ల్యాండ్ ఫ్రాంఛైజీలు తెరిచింది డిస్నీ సంస్థ. వాటికి కూడా అద్భుతమైన ఆదరణ లభించింది. ఐతే ఇప్పుడు డిస్నీ ల్యాండ్ ఇండియాలో కూడా కొలువుదీరబోతోందట. మన దేశంలో డిస్నీ ల్యాండ్ ఏర్పాటు చేయబోయేది హైదరాబాద్ లోని అని వార్తలు వస్తుండటం విశేషం.

హైదరాబాద్ శివార్లలోని 300 ఎకరాల్లో డిస్నీ ల్యాండ్ ఏర్పాటు చేయాలని డిస్నీ యాజమాన్యం భావిస్తోందట. రూ.25 వేల కోట్లతో దీన్ని తీర్చిదిద్దుతారని సమాచారం. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో డిస్నీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారట. ప్రభుత్వంతో పాటు డిస్నీ ప్రతినిధులు కూడా ఈ ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఎంటర్ టైన్ మెంట్ థీమ్ పార్క్ తో పాటుగా డొనాల్డ్ డక్ - డ్రాగన్స్ - ఐరోపా భవంతులు వంటి ప్రతిరూపాల్ని ఇక్కడ ప్రతిష్టించాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే.. హైదరాబాద్ ఇండియాలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా మారడం ఖాయం. అంతే కాక వేల మందికి ఉపాధి కూడా లభిస్తుంది. హైదరాబాద్ కు ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం లభిస్తుంది.
Tags:    

Similar News