వెంక‌య్య ఇద్ద‌రు చంద్రుళ్ల‌ను హెచ్చ‌రించారా?

Update: 2017-12-06 13:31 GMT
ఉపరాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు ఇటు రాజ‌కీయాల్లో అటు తెలుగు రాష్ర్టాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏక‌కాలంలో తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకు షాక్ ఇచ్చినట్లుంద‌ని చెప్తున్నారు. ఇంత‌కీ ఇదంతా దేని గురించి అనే క‌దా మీ సందేహం...రాజ్యంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌విలో ఉన్న ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య ..తెలుగు రాష్ర్టాల సీఎంల‌కు ఎలా షాకిచ్చారు అంటే...కార‌ణం ఆస‌క్తిక‌ర‌మే. తెలుగు రాష్ర్టాల సీఎంల‌కు అత్యంత ప్రీతిపాత్ర‌మైన జంపింగ్‌ ల విష‌యంలో ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు షాకిచ్చారు.

రాజకీయ ఫిరాయింపులను నివారించే నిమిత్తం చట్టసభ సభ్యుని అనర్హతను ప్రిసైడింగ్‌ అధికారి 3 నెలల్లోగా నిర్ణయించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. జేడీ(యూ) తిరుగుబాటు ఎంపీలు శరద్‌ యాదవ్‌ - అలీ అన్వర్‌ అన్సారీలను రాజ్యసభ నుంచి అనర్హులను చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులో ఆయన పై విధంగా పేర్కొన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌ పదవీ బాధ్యతలను నిర్వహిస్తున్న వెంకయ్య నాయుడు ఈ మేరకు ఒక అభ్యర్థన దాఖలు కావడంతో జేడీ(యూ) తిరుగుబాటు ఎంపీలను సభాహక్కుల సంఘానికి సిఫార్సు చేయకుండానే అనర్హులను చేశారు. ఒక చట్టసభ సభ్యుని సభలో కూర్చోనివ్వాలా వద్దా అనే అంశంపై వచ్చిన పిటిషన్లను అపరిష్కృతంగా ఉంచరాదని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రిసైడింగ్‌ అధికారి దానిని సాగదీయరాదని ఆయన అన్నారు. అలా చేయడం వలన ఫిరాయింపు నిరోధక చట్టం తాలూకు పరమార్థం దెబ్బతింటుందని రాజ్యసభ ఛైర్మన్‌ తన ఉత్తర్వులో పేర్కొన్నారు.

వ్యక్తుల సభ్యత్వాన్ని కాపాడ‌టానికి లేదా అలాంటి వ్యక్తుల కారణంగా మెజార్టీ అనుభవిస్తున్న ప్రభుత్వాన్ని రక్షించడానికి సదరు దరఖాస్తులను సాగదీస్తున్నారని ఆయన అన్నారు. అనర్హతా పిటిషన్లను సభా హక్కుల సంఘానికి పంపించడం వలన విచారణ ప్రక్రియ మరియు తుది నిర్ణయం తీసుకోవడంలో ఎనలేని జాప్యం చోటు చేసుకుంటున్నదని, అది రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ కు విరుద్ధమని వివరించారు. జేడీ(యూ) తిరుగుబాటు ఎంపీల అనర్హతా పిటిషన్లను సభాహక్కుల సంఘానికి సిఫార్సు చేయకపోవడపై ఆయన పై విధంగా వివరణ ఇచ్చారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో చట్టసభల ప్రిసైడింగ్‌ అధికారులు చేస్తున్న అనవసర జాప్యంపై సుప్రీంకోర్టు ఆందోళనలు చెందిన వైనాన్ని సైతం రాజ్యసభ ఛైర్మన్‌ ప్రస్తావించారు.

కాగా, ఈ ప‌రిణామం తెలుగు రాష్ర్టాల స వ‌ద్ద పెండింగ్ లో ఉన్న జంప్ జిలానీల‌కు షాక్ వంటిద‌ని అంటున్నారు. ఇటు తెలంగాణ‌లో - అటు ఏపీలో భారీ స్థాయిలో ఫిరాయింపులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణలో ముప్పై మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించ‌గా...ఏపీలో 24 ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు జంప్ చేశారు. అయితే ఈ పరిణామం వారికి టికెట్లు ఇచ్చిన పార్టీలు ఫిర్యాదు చేశాయి. తెలంగాణ‌లో టీడీపీ - కాంగ్రెస్‌ - వైసీపీ - సీపీఐ స్పీక‌ర్‌ కు - మండ‌లి చైర్మ‌న్‌ కు త‌మ ఫిర్యాదులు అందించాయి. త‌క్ష‌ణ చ‌ర్య‌ల కోసం డిమాండ్ చేస్తున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ చ‌ర్య‌లు లేని ప‌రిస్థితి. మ‌రోవైపు ఏపీలో త‌మ పార్టీ స‌భ్యుల‌ను ప్ర‌లోభ పెడుతూ పార్టీ మార్పించార‌ని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఇప్ప‌టికీ త‌న పోరాటాన్ని కొన‌సాగిస్తోంది. అయిన‌ప్ప‌టికీ స్పీక‌ర్ చర్య‌లు తీసుకోలేదు. ఈ ప‌రిణామాల‌ను ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన‌ట్ల‌యింద‌ని ప‌లువురు అంటున్నారు.

కాగా, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జేడీ(యూ) అధినేత నితిశ్‌ కుమార్‌ నిర్ణయం తీసుకోవడంపై తిరుగుబాటు ప్రకటించిన పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను అనర్హులను చేయాలంటూ పార్టీ నుంచి ఒక అభ్యర్థన సెప్టెంబర్‌ రెండవ తేదీన దాఖలైంది. అనర్హతా పిటిషన్లను నెలల తరబడి సాగదీసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కానీ ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య వీరి స‌భ్య‌త్వాల‌ను రద్దు చేస్తూ మూడు నెల‌ల‌లోపే నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదిలా ఉండగా రాజ్యసభ ఛైర్మన్‌ దిమ్మతిరిగే వేగంతో అనర్హతా పిటిషన్లను పరిష్కరించారని సీపీఎం నేత సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News