థాక్రే వర్గంపై అనర్హత వేటు ?

Update: 2022-07-08 04:38 GMT
అసెంబ్లీలో ఉద్థవ్ థాక్రే వర్గం ఎంఎల్ఏలపై అనర్హత వేటు పడబోతోందా ? స్పీకర్ రాహుల్ నర్వేకర్ తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా మారాయి. మూడురోజుల క్రితమే అసెంబ్లీలో బలనిరూపణ జరిగింది. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే 164 ఓట్ల మద్దతుతో బలపరీక్షలో నెగ్గారు. అయితే షిండేకి మద్దతుగా శివసేన ఎంఎల్ఏలందరు ఓట్లేయాలని విప్ జారీ అయ్యింది. దాన్ని థాక్రే నాయకత్వంలోని కొందరు ఎంఎల్ఏలు ఉల్లంఘించారు.

శివసేనకు ఉన్న 55 మంది ఎంఎల్ఏల్లో 40 మంది షిండే నాయకత్వంలో తిరుగుబాటు లేవదీసిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయి షిండే నాయకత్వంలోని శివసేన తిరుగుబాటు వర్గం+బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

ఈ నేపథ్యంలో జరిగిన బలపరీక్షలో నే షిండేవర్గం విప్ జారీచేసింది. అయితే థాక్రే మద్దతుగా ఉన్న 15 మంది ఎంఎల్ఏలు విప్ ను ఉల్లంఘించినట్లు షిండేవర్గం నుండి తనకు ఫిర్యాదులు అందాయని స్పీకర్ చెప్పారు.

తనకు అందిన 20 పిటీషన్లపై తొందరలోనే విచారణ జరపనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే థాక్రే వర్గంలోని 15 మంది ఎంఎల్ఏలపైన అనర్హత వేటు పడటం ఖాయమనే అనిపిస్తోంది. ఒకవేళ తెరవెనుక ఏదైనా ప్రయత్నాలు జరిగి వాళ్ళలో ఎవరైనా షిండే నాయకత్వానికి జై కొడితే అప్పుడేమైనా సీన్ మారుతుందేమో తెలీదు.

జరుగుతున్నది చూస్తుంటే అసెంబ్లీలో అసలు థాక్రే వర్గమన్నదే లేకుండా చేయాలని షిండే, బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లుంది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఉథ్థవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రే అనర్హత కారణంగా ఎంఎల్ఏ పదవిని కోల్పోవటం  ఖాయం.

ఉథ్థవ్ ఎంఎల్సీ కాబట్టి ఆయనకొచ్చే సమస్య ఏమీలేదు. అయితే అనర్హత వేటుపడి మళ్ళీ ఉపఎన్నికలు జరిగితే జనాలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. మరి అన్నింటికీ కాలమే సమాధానాలు చెప్పాలి.
Tags:    

Similar News