వైసీపీలో అసంతృప్తి: ప్రమాణస్వీకారానికి హాజరుకాని మాజీ మంత్రులు

Update: 2022-04-11 11:41 GMT
రెండున్నరేళ్ల తర్వాత తిరిగి కొత్త మంత్రివర్గాన్ని విస్తరిస్తానని సీఎంగా జగన్ గద్దెనెక్కినప్పుడే సెలవిచ్చాడు. అన్నట్టుగానే ఈరోజు కొత్త వారికి మంత్రిపదవులు ఇచ్చి ఇన్నాళ్లు పదవులు అనుభవించిన వారిని పక్కకు తప్పించారు. ఇందులో బొత్స, పెద్దిరెడ్డి, బుగ్గన లాంటి సీనియర్, కీలక నేతలకు మాత్రం మరోసారి అవకాశం ఇచ్చారు. మిగతా అందరినీ పక్కనపెట్టి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

జగన్ పాత మంత్రులకు మరోసారి అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తి జ్వాల ఎగిసిపడింది. మంత్రి పదవి దక్కకపోవడంతో మాజీ మంత్రి బాలినేని అలకపాన్పు ఎక్కారు. దీంతో ఆయనను స్వయంగా సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు. ఇక మాజీ హోంమంత్రి సుచిరిత అయితే ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసింది.

ఇక వీరే కాదు.. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఐదుగురు మాజీ మంత్రులు డుమ్మా కొట్టారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కాని మాజీ మంత్రుల్లో బాలినేని, సుచిరిత, అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని, శ్రీరంగనాథ రాజులు ఉన్నారు.

కొత్త కేబినెట్ లో తమకు అవకాశం దక్కకపోవడంతో వీరంతా అసంతృప్తిగా ఉండి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. జగన్ సన్నిహితులైన కొడాలి నాని, పేర్ని నాని, బాలినేనిలకు కూడా ఈసారి మరోసారి మంత్రి పదవులు దక్కకపోవడం గమనార్హం.

పూర్తిగా సామాజిక సమీకరణాలు, విధేయత.. పవర్ ఫుల్ గా మాట్లాడగల వారికి జగన్ అవకాశాలిచ్చారు. ఈ క్రమంలోనే కేబినెట్ లోకి రోజా, అంబటి రాంబాబు, అమర్ నాథ్ లాంటి వారు వచ్చి జాయిన్ అయ్యారు. ఈ కొత్త కేబినెట్ కూర్పులతో పాత వారు అలిగి అసంతృప్తి రాజేస్తున్నారు.

మరికొంత మంది మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోగా.. ఇంకొందరు అభిమానులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో కొత్త కేబినెట్ తో జగన్ కు కొత్త తలనొప్పులు వచ్చాయని అంటున్నారు.
Tags:    

Similar News