పులుసులో ముల‌క్కాయ‌లా తీసి పారేశార‌ట‌!

Update: 2017-11-28 07:52 GMT
హైద‌రాబాద్ న‌గ‌ర వాసులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ఈ రోజు ప్రారంభంకానుంది. జీఈఎస్ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు వ‌స్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. తొలుత ఎయిర్ పోర్ట్ నుంచి మియాపూర్‌ కు హెలికాఫ్ట‌ర్ కు రానున్నారు.

అక్క‌డ ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్క‌రించి మెట్రోరైల్లో ప్ర‌యాణించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీ.. గ‌వ‌ర్న‌ర్.. ముఖ్య‌మంత్రి.. కేంద్ర‌మంత్రులు.. హైద‌రాబాద్ మెట్రో రైల్ ఎండీతో పాటు.. ఎల్ అండ్ టీ ఎండీ హాజ‌రు కానున్నారు. పైలాన్ ప్రారంభానికి.. మెట్రో రైల్ ప్ర‌యాణానికి ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిన్న‌టికి నిన్న పైలాన్ మీద స్థానిక నేత‌ల పేర్లు లేక‌పోవ‌టంపై అధికార‌ప‌క్షంలో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. మెట్రో రైల్లో ప్ర‌యాణించే వారి జాబితాలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ జ‌నార్ద‌న్ రెడ్డి పేరు లేక‌పోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మెట్రో రైలు ఏర్పాట్ల‌కు సంబంధించి జీహెచ్ ఎంసీ క‌మిష‌నర్ హోదాలో చేసిన ఏర్పాట్లు అన్ని ఇన్ని కావు.  అయితే.. వీటిని దృష్టిలో పెట్టుకోకుండా క‌మిష‌న‌ర్ కు ఆహ్వానం లేక‌పోవ‌టంపై ప‌లువురు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మెట్రో రైలు శిలాఫ‌ల‌కంపై స్థానిక ఎమ్మెల్యే పేరుతో పాటు.. న‌గ‌ర మేయ‌ర్ పేరు లేదు. ఈ విష‌యాన్ని నిన్న గుర్తించి మంత్రి కేటీఆర్‌.. అధికారుల‌తో శిలాఫ‌ల‌కం మీద మార్పులు చేయాల‌ని కోరారు. అయిన‌ప్ప‌టికీ ఇవేమీ జ‌ర‌గ‌లేదు. ఓప‌క్క అధికార‌ప‌క్షానికి చెందిన కీల‌క నేత‌ల‌తో పాటు.. ముఖ్య అధికారుల పేర్లు కూడా లేక‌పోవ‌టం చూసిన వారంతా త‌మ‌ను పులుసులో ముల‌క్కాయ మాదిరి తీసిపారేస్తున్నారంటూ మండిప‌డుతున్నారు. కాకుంటే.. బ‌య‌ట ప‌డ‌లేక‌.. లోప‌ల దాచుకోలేక కిందామీదా ప‌డుతున్నారు. ఏమైనా ఒక ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టును ప్రారంభించే వేళ‌.. ఇలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూసుకోవాల్సి ఉంది. కానీ.. ఇవేమీ ప‌ట్టించుకోక‌పోవ‌టంతో అధికార‌ప‌క్ష నేత‌లు.. అధికారులు అసంతృప్తితో ర‌గులుతున్నారు. ఇది ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుందో..?
Tags:    

Similar News