పాస్ పోర్టు జారీలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! రకరకాల కండిషన్స్ విషయంలో అభ్యర్థులకు ఉపశమనం కలిగించే విప్లవాత్మక మార్పులకు తాజాగా విదేశాంగ శాఖ మార్పులకు శ్రీకారం చుట్టింది. వీటిలో ఎక్కువగా విడాకులు తీసుకున్న భార్య భర్తలకు - వారి పిల్లలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్లాన్ చేసింది. ఆధునిక కాలానికి అనుగుణంగా ఈ మార్పులు చేయడం తప్పదని సైతం విదేశాంగ శాఖ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో మహిళలు తప్పనిసరిగా తమ భర్త పేరును ఇవ్వాల్సిందేనన్న నిబంధనను తొలగిస్తూ ఒక నిర్ణయం తీసుకున్న విదేశాంగ శాఖ... భర్త నుంచి విడిపోయిన - విడాకులు తీసుకున్న మహిళలు భాగస్వామి పేరును దరఖాస్తులో ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
ఇదే క్రమంలో తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోయిన వారి పిల్లల పాస్ పోర్టుల్లో వారిద్దరి పేర్లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదని కూడా రూలు మార్చింది. ఈ కాలంస్ లో పేరు - లింగ నిర్ధారణ - వయసు వంటి వివరాలతోపాటు తల్లి - తండ్రి - సంరక్షకుడిలో ఏదో ఒక్క పేరు చేర్చినా సరిపోతుందని అధికారులకు సూచించింది. ఈ కారణాల వల్ల ఇప్పటివరకూ వేల కొలది ఫిర్యాదులు పాస్ పోర్టు ఆఫీసుకు వచ్చాయనీ, కొన్ని కేసులు కోర్టుల్లో కూడా నడుస్తున్నాయని, కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న దరఖాస్తుదారులపై ఇక ఒత్తిడి తేవొద్దనీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది విదేశాంగ శాఖ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/