ఆ టీడీపీ హీరోయిన్ క‌ష్టాలు అన్నీఇన్నీ కావుగా..

Update: 2019-07-03 04:27 GMT
ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత టీడీపీ నేత‌లు దిక్కు తెలియ‌ని - దారితోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన‌ క‌ష్టాలు ప‌డుతున్నారు. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం తెగ బాధ‌ప‌డుతున్నారు. ఇక ఇందులో ఆ పార్టీ నాయ‌కురాలు - మాజీ హీరోయిన్‌ దివ్య‌వాణి ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా త‌యారైంది.  ఆమె ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీలోకి ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చేసింది. అధికారం టీడీపీదేన‌ని - బాబు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని - త‌న‌కు కూడా ఏదో ఒక ప‌ద‌వి ద‌క్కుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారు. ఈ విష‌యాన్ని దివ్య‌వాణి త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర కూడా ప్ర‌స్తావించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. కానీ.. ఏం లాభం.. ఫ‌లితాలు చూశాక.. దివ్య‌వాణి ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది.

నిజానికి.. ఎన్నిక‌ల‌కు ముందు.. దివ్య‌వాణి టీడీపీలోకి వెళ్తుంటే.. జ‌య‌సుధ‌ లాంటి నాయ‌కులు వ‌ద్ద‌ని వారించార‌ట‌. టీడీపీ అధికారంలోకి రాదు... వైసీపీలోకి వెళ్ల‌మ‌ని సూచించినా దివ్య‌వాణి మాత్రం చంద్ర‌బాబు మంచి విజ‌న్ ఉన్న నేత ఏపీలో మ‌ళ్లీ టీడీపీ గెలిచి ఆయ‌నే ముఖ్య‌మంత్రి అవుతార‌ని ధీమా కూడా పోయారు. వాళ్ల మాట‌లు ప‌ట్టించుకోకుండా.. చంద్ర‌బాబును న‌మ్ముకుని తెలుగుదేశం కండువా క‌ప్పుకుంది. కానీ.. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి కేవ‌లం 23 అసెంబ్లీ - 3 పార్ల‌మెంటు సీట్లు ద‌క్క‌డంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏం చేయాలో తెలియ‌ని అమోమ‌య స్థితిలోకి వెళ్లిపోయారు.

చేజేతులా రాజ‌కీయ జీవితాన్ని నాశ‌నం చేసుకున్నాన‌ని ఇప్పుడు టీడీపీ వాళ్ల ముందే బాధ‌ప‌డుతున్నార‌ట‌. ఇక ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో అతివిశ్వాస‌మే దెబ్బ‌తీసిందంటూ.. దివ్వ‌వాణి కొంచెం గ‌ట్టిగానే.. అంటే ఓపెన్‌ గానే మాట్లాడిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వచ్చి నెల రోజులు కూడా కాక‌ముందే అప్పుడే వైసీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే ప‌నిలో ప‌డ్డారు దివ్య‌వాణి. అయితే.. ఇక్క‌డ స‌మ‌స్య ఏమిటంటే.. ఆ విమ‌ర్శ‌లు నిర్మాణాత్మ‌కంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రెండు మూడు రోజుల‌కు ఓ సారి మీడియా ముందుకు వ‌చ్చి ఏదేదో మాట్లాడేసి వెళ్లిపోతున్నారే త‌ప్పా ఆమె మాట‌లు ప‌ట్టించుకున్న వారే లేరు. ఇటీవ‌ల హోం మంత్రి సుచ‌రిత‌పై దివ్య‌వాణి చేసిన విమ‌ర్శ‌ల్లో అర్థంప‌ర్థం లేదు. వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి నెల‌రోజుల‌కే.. మొత్తం పాల‌న అంతా గాడిత‌ప్పిన‌ట్లు ఆమె మాట్లాడ‌డంపై ప్ర‌జ‌ల్లోనే కాదు.. టీడీపీ శ్రేణుల్లోనూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దివ్య‌వాణి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకుని టీడీపీలోకి వ‌చ్చినా మ‌రో ఐదేళ్ల వ‌ర‌కూ ఆ ఛాన్సే లేదు. టీడీపీ చిత్తుగా ఓడిపోవ‌డంతో మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వులు ఆ పార్టీకి రావు. అప్ప‌టి వ‌ర‌కు ఆమె వైసీపీపై విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం త‌ప్ప చేసేదేం ఉంటుంది. ఒక్క దివ్య‌వాణీయే కాదు టీడీపీ నేత‌లు కూడా ఏం చేస్తున్నారో అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొంది.


Tags:    

Similar News