కేసీఆర్ - బాబులపై.. డీకే అరుణ కామెంట్స్

Update: 2016-10-05 04:35 GMT
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నోళ్లు కొద్ది మందే. అందులోకి విపక్షాల్లోఅలాంటి స్వభావం మరింత తక్కువ. ఇక.. మహిళా రాజకీయవేత్తల్లో ‘ఫైర్ బ్రాండ్’ పేరంటే అంత చిన్న విషయమే కాదు. మరి.. అలాంటి ట్యాగ్ లైన్‌ తన పేరు ముందు వచ్చేలా చేసుకున్న వైనం.. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత డీకే అరుణ సొంతం. ఆమె ఏదైనా విషయం మీద స్టాండ్ తీసుకున్నారంటే.. దాని అంతు చూసే వరకూ వెనక్కి తగ్గకపోవటం.. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా.. మొండితనంతో పోరాడటం.. దాన్ని సాధించే వరకూ వెనక్కి తగ్గకపోవటం ఆమె నైజం. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా వాసుల్లో అత్యధికుల్లో ఉన్న గద్వాల జిల్లా ఏర్పాటులో ఆమె కీలకభూమిక పోషించారని చెప్పక తప్పదు.

గద్వాల జిల్లా ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అంత సుముఖంగా లేరన్న మాట అధికారపక్ష సభ్యులే చెబుతుంటారు. అలాంటిది.. కేసీఆర్ కన్విన్స్‌ అయ్యేలా చేయటమే కాదు.. జిల్లా ప్రకటించక తప్పని పరిస్థితుల్ని క‌ల్పించ‌డం అంత తేలికైన విషయం కాదు. ఆలాంటి క్లిష్టమైన పనిని విజయవంతంగా పూర్తి చేయటం ద్వారా తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారు డీకే అరుణ. తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆమె పలు ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఆరోపణాస్త్రాన్ని సంధించటమే కాదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గురించి.. జగన్ ను సీఎం చేయకపోవటానికి కారణాలు.. ఆయనపై కేసుల అంశాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యమైన కొన్ని ముచ్చట్లు చూస్తే..

= రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. వారి మధ్యనున్న సంబంధాలు చూస్తూ.. ఇద్దరి మధ్య ఒప్పందాలు జరిగిపోయాయి. బయటకు మాత్రం ఇద్దరూ సెంటిమెంటు చూపిస్తున్నారు. చంద్రబాబేమో తెలంగాణను చూపించి అక్కడ సెంటిమెంటు ఆట ఆడతాడు. ఈయనేమో (కేసీఆర్ ను ఉద్దేశించి)చంద్రబాబును చూపించి ఇక్కడ ఆట ఆడతారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్.. అక్కడ ఓటుకు నోటు.. ఉన్నదల్లా సెంటిమెంట్ రాజకీయమే. కేసీఆర్ వైఖరికి వస్తే.. ఆయన పూర్తిగా మారిపోయారు. పూర్తిగా నియంతగా మారిపోయారు. తాను చెప్పిందే శాసనం అన్నట్లుగా తయారైంది.

= దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు.. చంద్రబాబుకు.. కేసీఆర్ కు పోలికేంటన్న ప్రశ్నకు బదులిస్తూ.. చంద్రబాబు గురించి వ్యాఖ్యానిస్తూ.. రాజకీయంగా తన వెంట ఉన్న వారు.. తన వారు అనుకుంటే వారిని ఏం చేసైనా సరే కాపాడుకోవాలన్న గొప్ప గుణం రాజశేఖర్ రెడ్డిలో ఉండేది. లేని ముద్రలు వేసి పరాభవించే తత్వం టీడీపీలో చూశాం. ఇద్దరికి మధ్య చాలానే తేడా ఉంది. ఇక.. కేసీఆర్ విషయానికి వస్తే.. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదయం పూట గంటన్నర పాటు వందలు.. వేలాది మంది ప్రజలు ఆయన్ను కలిసే వారు. కేసీఆర్ అయితే ప్రజల సంగతి పక్కన పెట్టండి.. ఎమ్మెల్యేలకే సమయం ఇవ్వటం లేదు. ఒక ప్రజా నేత అన్న వ్యక్తి ప్రజలను కలవాలి కదా?

= వైఎస్ ఆకస్మిక మరణంతో జగన్ ను ముఖ్యమంత్రిని చేయమన్నా కాంగ్రెస్ అధినాయకత్వం అలా చేయకపోవటం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. వైఎస్సార్ కు అలా జరుగుతుందని మేం అనుకోలేదు. తల్చుకుంటేనే బాధేస్తుంది. ఆయన మీద అభిమానం అనుకోండి.. ఆ సమయంలో రేగిన ఉద్వేగాలు కానివ్వండి.. అప్పట్లో జగన్ ను సీఎం చేయాలనే మేమంతా కోరుకున్నాం. వాళ్ల కుటుంబం మొత్తానికి అప్పట్లో పెద్ద అండగా ఉన్నాం. కొంత ఓపిక పట్టమని జగన్ కి కూడా చెప్పాం. కానీ.. అందుకు భిన్నంగా జరిగిపోయింది. జగన్ పార్టీ విడిచి పెట్టారన్న కోపంతో కేసులు పెట్టించారని అనుకోను. కొందరు కోర్టుల్లో కేసులు వేశారు. అదే సమయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి.. కాంగ్రెస్ చేసిందన్న ఆరోపణ‌లు వచ్చాయి. ఈ కేసులతో అనేక యాక్షన్లు.. రియాక్షన్లు జరిగియి. అంతేకానీ ప్రత్యక్షంగా కక్ష కట్టి సాధించారని అనుకోను.

= తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి కారణాల గురించి చెబుతూ.. తెలంగాణ సెంటిమెంట్ కు కేసీఆర్ మరింత పెట్రోల్ పోసి.. మంటలు మండించి లబ్థి పొందటానికి ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నిజమైపోతాయని.. ఆయన ఉంటే తమకు మేలు జరుగుతుందని.. టీఆర్ఎస్ కు ఒకసారి ఓటు వేద్దామన్న ఆలోచనతో ఓటేశారు. కేసీఆర్ సర్కారు గురించి నేను చెప్పేది ఒక్కటే. ఆయన ఆడుతున్న సెంటిమెంట్ రాజకీయాలకు లోబడొద్దు. దేని కోసం తెలంగాణను అంతా కోరుకున్నామో ఆ దిశగా ప్రభుత్వం పని చేస్తుందా అన్నది ఆలోచించాలి. ప్రజాస్వామ్యం లేని రాష్ట్రంలో పాలకులకు సమిధలుగా మారొద్దు. మేల్కొనాలి అని మాత్రం చెప్పగలను.

= తెలంగాణ ఇచ్చి తప్పు చేశామనుకోవటం లేదు.  చివరి నిమిషంలో కాకుండా ఒక ఏడాది ముందే ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉండేది. కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా తెలంగాణ వ్యతిరేక వైఖరి తీసుకోకుండా ఉంటే బాగుండేది. ఆంధ్రకు ఏదో జరిగిపోతుందన్న ఉద్వేగంతో ఆయన మరో మార్గం చేపట్టటం కార‌ణంగా రెండు ప్రాంతాల్లోనూ పార్టీ నష్టపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News