సిద్ధరామయ్య అప్పుడు భయపడ్డారు: డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-06-28 16:31 GMT
ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 224 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ సొంతంగా 135 సీట్లు సాధించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్ల మార్కును అధిగమించింది. తద్వారా ఎవరి మద్దతు అవసరం లేకుండానే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ పోటీ పడ్డా ఆ పదవిని సిద్ధరామయ్య ఎగరేసుకుపోయారు. డీకే శివకుమార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉండటానికి అంగీకరించక తప్పలేదు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఈ ఇద్దరు నేతలూ బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఉద్దేశించి డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సిద్ధూ సీఎంగా ఉన్న సమయంలో ఓ ప్రాజెక్ట్‌ గురించి ఆయన భయపడ్డారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో డీకే వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. రాజస్థాన్‌ లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలకు దారితీసినట్టు కర్ణాటకలోనూ ఇదే రిపీట్‌ అవుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఇంతకు డీకే శివకుమార్‌ ఏమన్నారంటే.. బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ జయంతి సందర్భంగా విధానసౌధ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో డీకే శివకుమార్‌ మాట్లాడారు. తమ ప్రభుత్వం టన్నెల్స్, ఫ్లై ఓవర్లు నిర్మించాలని చాలా మంది అభ్యర్థిస్తున్నారని తెలిపారు. అయితే అలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి చాలా సవాళ్లు ఎదురవుతాయని వెల్లడించారు.

2017లో ఇలాగే బెంగళూరులో స్టీల్‌ ప్లైఓవర్‌ నిర్మించాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తలపెట్టిందని గుర్తు చేశారు. అయితే దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైందని చెప్పారు. దీంతో అప్పటి సీఎం సిద్ధరామయ్య, బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జ్‌ ఆ ఆందోళనలకు భయపడ్డారని డీకే శివకుమార్‌ తెలిపారు. అదే తానైతే.. అలాంటి నిరసనలకు తలొగ్గేవాణ్ని కాదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మాణానికే ముందుకెళ్లేవాణ్ని అని చెప్పారు.

డీకే శివకుమార్‌ తాజా వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారాయి. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే పూర్తయిన నేపథ్యంలో అప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేటు చేస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సిద్ధూతో డీకేకు పొసగడం లేదని.. అందుకే డీకే శివకుమార్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో శివకుమార్‌ వ్యాఖ్యలపై అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, రాష్ట్ర మంత్రి అయిన ప్రియాంక్‌ ఖర్గే స్పందించారు. సిద్ధరామయ్య భయపడ్డారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రజల అభిప్రాయాలతో సీఎం సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.

కొన్నిసార్లు తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చి మంచి నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యమవుతుంటుందన్నారు. డీకే శివకుమార్‌ ఆ ఉద్దేశంతోనే చెప్పి ఉంటారేమోనని అభిప్రాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతోకాలం అధికారంలో ఉండదని.. మధ్యలోనే కుప్పకూలుతుందని బీజేపీ నేతలు చెబుతుండటం గమనార్హం.

Similar News