డీఎల్ ఆశలు ఆవిరి.. ఇక ఇండిపెండెంట్ గానే..

Update: 2019-03-05 04:47 GMT
కాంగ్రెస్ పార్టీ తెలంగాణను విభజించి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు భూస్థాపితమైంది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దండులుగా వెలుగు వెలిగిన కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు పార్టీలు మారారు. మరికొందరు కాంగ్రెస్ లోనే ఉండి రాజకీయాలకు దూరంగా జరిగారు. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు వచ్చే ఏపీ అసెంబ్లీలో బరిలోకి దిగడానికి కాంగ్రెస్ సీనియర్లు రెడీ అయిపోతున్నారు. అయితే టీడీపీ లేదంటే వైసీపీ వైపు చూస్తున్నారు.

ఆ కోవలోనే వైఎస్ హయాంలో మంత్రిగా వెలుగు వెలిగిన డీఎల్ రవీంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం మైదకూరు నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఆయనకు సీటు ఇచ్చే విషయంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ వెనకడుగు వేస్తున్నాయి.

తాజాగా డీఎస్ రవీంద్రారెడ్డి మనుషులు ఇడుపుల పాయ వెళ్లి జగన్ తో సమావేశమయ్యారట.. తమ నేతకు మైదుకూరు అసెంబ్లీ సీటును కేటాయించాలని కోరారు. అయితే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో జగన్ టికెట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదని సమాచారం. తన వెంట ఐదేళ్లు నడిచిన ఎమ్మెల్యేను మార్చడానికి జగన్ ఒప్పుకోకపోవడంతోపాటు డీఎల్ కు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చాడట.. పార్టీలోకి రావాలని ఆహ్వానించాడట.. అయితే తాను ఈసారి ప్రత్యక్ష పోటీకే మొగ్గు చూపుతున్నట్లు డీఎల్ పట్టుబట్టడంతో ఈ ప్రతిపాదన వీగిపోయింది..

ఇక డీఎల్ టీడీపీతోనూ మైదకూరు టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అక్కడ టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ బలంగా ఉండడం..చంద్రబాబు ఇప్పటికే ఆయనకు టికెట్ ఖాయం చేయడంతో డీఎల్ కు నిరాశ ఎదురైనట్టు సమాచారం. దీంతో రెండు ప్రధాన పార్టీల నుంచి హామీ దక్కకపోవడంతో డీఎల్ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి రెడీ అవుతున్నాడట.. కొందరు సన్నిహితులు జనసేన తరుఫున బరిలో నిలవాలని కోరినా.. ఆ పార్టీ బలం దృష్ట్యా స్వతంత్రుడిగానే మేలని డీఎల్ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇలా కాంగ్రెస్ సీనియర్లకు పార్టీలు కరువవడం.. స్వతంత్రులుగా బరిలోకి దిగుతుండడంతో ఎంత మేరకు వారు ప్రభావం చూపిస్తారన్నది ఆసక్తిగా మారింది.
    

Tags:    

Similar News