జగన్ కి రెడ్డి సిగ్నల్!

Update: 2021-10-16 09:31 GMT
వైఎస్ జగన్మోహనరెడ్డి అందరి లాంటి సీఎం కాదు, ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. రాజకీయ ప్రత్యేకత ఉంది. అదేంటో అందరికీ తెలిసిందే. ఏపీ కులాల సమాహారం. కాంగ్రెస్ పార్టీ రెడ్లను సపోర్ట్ చేసింది. టీడీపీ కమ్మల కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ అంటారు. ఇవన్నీ బయటకు చెప్పకపోయినా పచ్చి నిజాలే. ఇక రెడ్లు ఇప్పటిదాకా సీఎంలు అయ్యారు అంటే అది కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ చలువతోనే. కాంగ్రెస్ లో ఎన్నో కులాలు ఉన్నా మొదటి నుంచి ఆ పార్టీని వెన్నంటి ఉన్న రెడ్లను ప్రోత్సహిస్తూ వచ్చింది. అలా కాంగ్రెస్ నుంచి అనేక మంది రెడ్లు ముఖ్యమంత్రులుగా కుర్చీ ఎక్కారు. ఇక జగన్ తీరు ఇందుకు భిన్నం. ఆయనను ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్ కాదంది. దాంతో జగన్ బయటకు వచ్చారు. అదే నేపధ్యంలో రెడ్లకు కూడా కాంగ్రెస్ చర్య ఆగ్రహం కలిగించింది.

జగన్ కాంగ్రెస్ ని ఎదిరించి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అలా తొలిసారి రెడ్లు తమకంటూ ఒక ప్రాంతీయ పార్టీ ఉందని, అది తమదని భావించారు. అయితే గత రెండున్నరేళ్ల జగన్ ఏలుబడిలో రెడ్లకు భ్రమలు మెల్లగా తొలగిపోతున్నాయా అన్న సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ మోస్ట్ నేత ఆనం రామనారాయణరెడ్డితో మొదలుపెడితే అదే నెల్లూరు జిల్లాలోని మరో రెడ్డి నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వంటి వారు తమకు పదవులు దక్కకపోవడం పట్ల గుర్రుమంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో జగన్ కి దగ్గర బంధువు అయిన భూమన కరుణాకరరెడ్డి సైతం మంత్రి పదవి ఆశించి ఇపుడు రాజకీయ వైరాగ్యాన్ని ఆశ్రయించారు. మరో రెడ్డి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా మంత్రి రేసులో ఉన్నా నిరాశే కలుగుతోందిట. ఆర్కే రోజా లాంటి వారు వైసీపీలో ఉండడానికి కారణం కూడా కులం ట్యాగే అంటారు.

ఇక జగన్ సొంత జిల్లా కడపలో కూడా చాలా మంది రెడ్లు పదవులు లేక ఆశలు తీరక నలిగిపోతున్నారు. అలాంటి వారిలో జగన్ నేస్తం గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు. జగన్ మర్క్ సోషల్ ఇంజనీరింగ్, కులాల సమీకరణలు అన్నీ కలిస్తే రెడ్లకు పదవులు హుళక్కి అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే వైసీపీకి మద్దతు ఇచ్చి ప్రస్తుతం జగన్ మీద దారుణమైన కామెంట్స్ చేస్తున్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఎపిసోడ్ రెడ్లలో ఆసక్తికరమైన చర్చకు తావు ఇస్తోంది. ఆయన జగన్ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేస్తూ రెడ్ల ప్రభుత్వం రావాలని కోరుకున్న వారికి బుద్ధి వచ్చింది అన్నారు. అంటే దాని అర్ధం జగన్ని తాము సొంతంగా భావించామని, వైసీపీని ఇంటి పార్టీగా కొలిచామని అనుకోవాలి.

ఇది కేవలం డీఎల్ లాంటి వారి మాటే కాదు అన్నది కూడా వినిపిస్తోంది. డీఎల్ అయితే ఇక వైసీపీతో తెగదెంపులు చేసుకుంటున్నారు కాబట్టి హార్ష్ గా మాట్లాడారు, కానీ దాదాపుగా రెడ్డి కులస్థులందరిలో ఇదే రకమైన భావన ఉంది అంటున్నారు. ఎందుకంటే టీడీపీలో కూడా పదవులు బీసీలు ఇతర కులస్థులకు ఇచ్చారు. కానీ కమ్మలకు కూడా అధిక ప్రాధ్యాన్యత ఉండేది. అలాగే వైసీపీ కూడా రాజకీయంగా ఇతర కులాలను ఎంతలా చేరదీసినా తప్పులేదు కానీ ఆ నెపంతో రెడ్లకు ఎసరు పెడితే ఎలా అన్నదే వారి వేదనగా ఉంది. మొత్తానికి డీఎల్ వ్యాఖ్యలు చూస్తూంటే వైసీపీకి రెడ్ల నుంచి రెడ్ సిగ్నల్ గట్టిగానే ఎదురయింది అంటున్నారు. మరి దీన్ని జగన్ సర్దుబాటు చేసుకుంటారా లేదా అన్నది కూడా చూడాలి.
Tags:    

Similar News