‘అధినేత’ ప్రచారం వద్దంటున్న తంబీలు

Update: 2016-04-24 04:53 GMT
ఎన్నికలు జరిగే వేళ.. పార్టీ అధినేత ప్రచారానికి వస్తానంటే సంతోషిస్తారు. అయ్యా ఎప్పుడు వస్తారంటూ వెంటపడతారు. అలా వచ్చి ముఖం చూపించి ఇలా వెళ్లిపోండని వేడుకుంటారు. కానీ.. తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఒక పార్టీ అధినేత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకుంటున్న డీఎండీకే అధినేత.. కెప్టెన్ గా సుపరిచితుడైన విజయకాంత్ ఎన్నికల ప్రచారానికి వస్తానంటే పార్టీ అభ్యర్థులు వణికిపోతున్నారు.

విగ్రహం భారీగా ఉన్న నిగ్రహం ఏమాత్రం లేని విజయకాంత్ కారణంగా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే కన్నా.. ఆయన్ను ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు ఆ పార్టీ అభ్యర్థులు. ఇటీవల కాలంలో ఆయన తీరు.. మాటలు హాట్ టాపిక్ గా మారాయి. కోపం వస్తే వెనుకా ముందు చూసుకోకుండా జర్నలిస్టులు.. పార్టీ నేతల్ని కొట్టేస్తున్న కెప్టెన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల వేళ ఇలాంటి వివాదాస్పద అంశాలు తమ విజయవకాశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయోనన్న ఆందోళన కు గురి అవుతున్నారు కెప్టెన్ పార్టీ అభ్యర్థులు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎన్నికల ప్రచారానికి కెప్టెన్ వస్తున్నారంటే వణికిపోతున్న డీఎండీకే అభ్యర్థులు.. ఆయన స్థానే కెప్టెన్ సతీమణి ప్రేమలత రావాలని కోరుకుంటున్నారు. కెప్టెన్ వస్తానని చెప్పినా.. రావొద్దని ఆయన ముఖానే చెప్పిసి షాక్ ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి మీరొద్దయ్యా అంటూనే.. అమ్మగారిని పంపిస్తే చాలనటం డీఎండీకేలో ఇప్పుడో అలవాటుగా మారింది. పార్టీ అధినేతను ప్రచారానికి రావొద్దంటే రావొద్దని తేల్చి చెప్పేయటం కెప్టెన్ పార్టీలో మాత్రమే కనిపిస్తుందేమో..?
Tags:    

Similar News