తమిళ పెద్దాయనకు అస్సలు బాగోలేదట

Update: 2016-12-16 04:19 GMT
తమిళనాడు రాష్ట్రం టైమ్ ఏ మాత్రం బాగున్నట్లుగా లేదు. ఒకటి తర్వాత ఒకటిగా మీద పడిపోతున్న సమస్యలు చూస్తే.. అయ్యో అనిపించాల్సిందే. 75 రోజులపాటు తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన ‘అమ్మ’జయలలిత మరణించటం.. ఆ వార్తతో తమిళులు నిలువెత్తు శోకంలో మునిగిపోవటం తెలిసిందే.

ఆ షాక్ నుంచి తేరుకునే లోపే.. వార్దా తుపాను రూపంలో తమిళులకు మరో పెద్ద పరీక్ష వచ్చి పడింది. ప్రకృతి ప్రకోపంతో తమిళులు విలవిలలాడుతున్నారు. ఇది సరిపోనట్లుగా.. తమిళనాడు విపక్ష నేత.. డీఎంకే అధినేత కరుణానిధి అస్వస్థతకు గురై.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిజానికి అమ్మ జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే.. కరుణ సైతం అస్వస్థతకు గురై.. కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందటం తెలిసిందే.

తర్వాత ఆయన ఆరోగ్యం కాసింత కుదుట పడింది. తాజాగా కరుణానిధి మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. గొంతు.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవటానికి ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గడిచిన పదిహేను రోజుల్లో కరుణ రెండుసార్లు అస్వస్థతకు గురి కావటం గమనార్హం. నవంబరులో ఒకసారి అస్వస్థతకు గురి కాగా.. డిసెంబరు ఒకటిన డీహైడ్రేషన్.. అలర్జీ సంబంధిత అనారోగ్య కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. వారం రోజులు చికిత్స చేసి.. డిశ్చార్జ్ చేసిన ఆయన.. తాజాగా మరోసారి అస్వస్థతకు గురై ఆసుపత్రికి వెళ్లటం పలువురు తమిళులను కలిచివేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News