హోదాకు అనుకూలంగా డీఎంకే ఓకే చెప్పేసింది

Update: 2016-07-21 07:04 GMT
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఏపీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లు మరో రోజులో రాజ్యసభలో చర్చకు రానున్న వేళ.. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటే వేసేందుకు ఓకే చెప్పింది తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ. ఇప్పటివరకూ ఈ బిల్లుకు బీజేపీ మినహా ఏపీలోని అధికార.. విపక్ష పార్టీలన్నీ అనుకూలంగా నిర్ణయం తీసుకోగా.. తాజాగా డీఎంకే కూడా ప్రత్యేక హోదాకు తన మద్ధతును ప్రకటించింది.

తాము ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించేలా చేయటం కోసం కాంగ్రెస్ లాబీయింగ్ మొదలెట్టింది. వాస్తవానికి ఈ పనిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేయాల్సింది. అయితే.. బిల్లు పాస్ అయితే క్రెడిట్ కాంగ్రెస్ కే వస్తుందన్న కారణం కావొచ్చు.. కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించకూడదన్న మిత్రధర్మానికి తలొగ్గిన చంద్రబాబు తనకు తాను మద్దతు పలుకుతున్నా.. అన్ని పక్షాల్ని సమీకరించే పని మాత్రం చేయటం లేదు.

గతంలో ఇలాంటి అంశాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అందరిని జట్టు కట్టే బాబు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. బాబు సంగతి ఇలా ఉన్నా.. ఏపీ భవితకు కీలకమైన బిల్లు విషయంలో కాంగ్రెస్ ప్రయత్నాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా డీఎంకే ఓకే చెప్పిన నేపథ్యంలో.. మరింత ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ మరికొన్ని పార్టీల్ని ఈ అంశానికి మద్ధతు ఇచ్చేందుకు వీలుగా ఒప్పించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.
Tags:    

Similar News