వచ్చి వెళ్లినట్లు కనిపించే ఒమిక్రాన్ ను లైట్ తీసుకోకూడదట

Update: 2022-01-27 07:36 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఎప్పటి మాదిరే ప్రభుత్వం చెబుతున్న పాజిటివ్ లెక్కలకు.. గ్రౌండ్ లెవల్లో వాస్తవానికి ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. మొదటి.. రెండో వేవ్ లతో పోలిస్తే మూడో వేవ్ లో పాజిటివ్ కేసుల వెల్లడిలో తేడా మరింత పెరిగినట్లుగా చెబుతున్నారు. ఇంట్లోనే ఉండి పాజిటివ్.. నెగిటివ్ అన్న విషయాన్ని తెలియజేసే కిట్లు వచ్చేయటంతో.. పాజిటివ్ లెక్కలు అధికారికంగా నమోదు కావటం లేదని చెబుతున్నారు. ఇక..పాజిటివ్ లుగా తేలుతున్న వారిలో అత్యధికులు ఒమిక్రాన్ కేసులేనని చెబుతున్నారు.

సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ లో పాజిటివ్ గా తేలిన వారిలో రోగ లక్షణాల తీవ్రత తక్కువగా ఉండటం తెలిసిందే. సెకండ్ వేవ్ లో పది.. పన్నెండు రోజుల పాటు చుక్కలు చూపించే డెల్టా వేరియంట్ తో పోలిస్తే.. థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ మూడు.. నాలుగురోజుల్లోనే కోలుకునే పరిస్థితి. ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా మార్గదర్శకాల ప్రకారం చూసినా.. వారంలో విధుల్లో చేరిపోతున్న వైనాలు చాలానే చూస్తున్నాం. అలా అని ఒమిక్రాన్ ను లైట్ తీసుకోవటం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

చాలామందికి జలుబు.. జ్వరం.. గొంతు నొప్పి వంటి లక్షణాలు త్వరగానే తగ్గుముఖం పడుతున్నా.. దగ్గు.. తలనొప్పి.. ఒళ్లునొప్పులు.. నీరసం లాంటివి మాత్రం తగ్గట్లేదని చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కంటిన్యూ అవుతుంటే మాత్రం డాక్టర్ ను  సంప్రదించటం మేలని చెబుతున్నారు. దగ్గు తీవ్రత పెరిగినా.. లేదంటే తక్కువగా ఉన్నప్పటికి ఆరేడు రోజులకు కూడా తగ్గకపోతే మాత్రం డాక్టర్ ను సంప్రదించటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చాలా సందర్భాల్లో ఒమిక్రాన్ గొంతు వరకే పరిమితమవుతున్నా.. కొన్ని సందర్భాల్లో మాత్రం ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశం ఉందని.. దీన్ని తొలిదశలోనే గుర్తించటం ద్వారా ముప్పు తప్పించుకోవచ్చని చెబుతున్నారు. డెల్టా వేరియంట్ లో ఎక్కువమందిలో శ్వాసకోశాలపై ప్రభావం పడింది. ఒమిక్రాన్ బాధితుల్లో మాత్రం ఈ సమస్య ఎక్కువగా లేదు. శ్వాసకోశాల్లో ఇన్ ఫెక్షన్ కు గురైన వారు ఒక శాతం కంటే తక్కువ మందే ఉంటున్నారని.. ఆసుపత్రుల్లో చేరే వారు కూడా అతి తక్కువగా ఉండటం తెలిసిందే.

ఒమిక్రాన్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది తొలుత గొంతులో ఇబ్బంది.. దురద లాంటి లక్షణాలతో పాటు తలనొప్పి బారిన పడుతున్నారు. ఇలాంటి వారికి జ్వరం కూడా వస్తోంది. కొందరికి తలనొప్పి ఒకవైపే వచ్చి తీవ్రంగా వేధిస్తోందని చెబుతున్నారు. కొందరు చలిజ్వరంతోనే బాధ పడుతుంటే.. ఇంకొందరికి డెంగీలో వచ్చినట్లుగా ఒళ్లు నొప్పులు వస్తున్నాయి. ఉన్నట్లుండి చెమటలు కూడా పడుతున్నాయి. పిల్లల్లో కొందరికి వాంతుల బారి పడి.. కళ్లు ఎర్రబడుతున్నాయి. కొందరికి వ్యాధి తగ్గినా దగ్గు మాత్రం రెండు - మూడు వారాల పాటు వెంటాడుతుందని.. ఇలాంటి వారు వైద్యుడ్ని సంప్రదించటం మంచిదని చెబుతున్నారు.
Tags:    

Similar News