కరోనా చికిత్సలో వాడుతున్న మోల్నుపిరవిర్ ఔషధాన్ని యువతకు ఇవ్వకూడదని.. వారు ఈ మందు వాడితే.. పిల్లలు పుట్టే అవకాశం ఉండదని.. ఇమ్యునైజేషన్పై ఏర్పాటు చేసిన జాతీయ సాంకేతిక సలహా సంఘం వర్కింగ్ +-
గ్రూప్ ఛైర్మన్ ఎన్కే అరోడా స్పష్టం చేశారు. మోల్నుపిరవిర్ ఇస్తే యువత సంతానోత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఒకవార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. అహేతుకంగా ఔషధాన్ని వినియోగించడం ప్రమాదకరమని అన్నారు.
"ఇన్ఫెక్షన్ సోకిన తొలినాళ్లలో మోల్నుపిరవిర్ ఇస్తే ప్రయోజనాలు ఉంటాయి. ఐసీయూలు, ఆస్పత్రిలో చేరే ముప్పును ఔషధం తగ్గిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులకు చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. యువతకు ఈ ఔషధాన్ని ఇవ్వకూడదు. ఇది శరీరంలో మ్యుటేషన్లను ఏర్పరుస్తుంది. ఇది సంతానోత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అరడా అన్నారు.
మరోవైపు, మోల్నుపిరవిర్ను కరోనా చికిత్సలో చేర్చడం లేదని అధికారులు తెలిపారు. కొవిడ్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రొటోకాల్లో మోల్నుపిరవిర్ను చేర్చకూడదని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) నేషనల్ టాస్క్ఫోర్స్ నిర్ణయించిందని వెల్లడించారు. 'కరోనా చికిత్సలో ఈ ఔషధం పెద్దగా ప్రభావం చూపడం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు' అని అధికారులు చెప్పారు. మోల్నుపిరవిర్ వల్ల దుష్ప్రభావాలు తలెత్తుతున్న నేపథ్యంలో.. ఈ డ్రగ్ మాత్రలను కొవిడ్ చికిత్స జాబితాలో చేర్చలేదని ఐసీఎంఆర్ హెడ్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు.
మోల్నుపిరవిర్ ఔషధానికి డిసెంబర్లో అత్యవసర అనుమతులు లభించాయి. ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిప్లా సంస్థకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. జనవరి 3న ఈ ఔషధం కొవిడ్ బాధితులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, చాలా మంది వైద్యులు ఈ డ్రగ్ను రోగులకు సిఫార్సు చేయడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం పిల్లలు పుట్టడంపై ఈ ఔషధం ప్రభావం చూపుతంఉదని భావిస్తుండడమేనని అంటున్నారు.