ఈటల-రఘురామకి ఎన్ని పోలికలున్నాయో తెలుసా ?

Update: 2021-05-27 12:30 GMT
తెలుగురాష్ట్రాల్లోని ఇద్దరు ప్రజాప్రతినిధులది దాదాపు ఒకే కదలాగుంది. అధిష్టానం వర్గాలతో పడనికారణంగా ఇద్దరు రెబల్ గా తయారయ్యారు. ఇద్దరు కూడా తమ పార్టీ అధినేతలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నేతలతో చేతులు కలిపారు. తమ అధినేతలపై తరచు మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు, విమర్శలకు దిగేశారు. చివరకు ఇద్దరు కూడా తమ పదవులకు రాజీనామాలు చేయకుండా పార్టీల్లోనే ఇంకా కంటిన్యు అవుతున్నారు.

ఇప్పటికే మీకు అర్ధమైపోయుంటుంది ఇదంతా ఎవరిని ఉద్దేశించో. అవును మీరూహించింది కరెక్టే. ఏపిలో నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు, తెలంగాణాలో హుజూరాబాద్ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ గురించే. జగన్మోహన్ రెడ్డితో పడక 2019లో గెలిచిన కొద్దిరోజులకే రఘురామ పార్టీకి దూరంగా జరిగారు. ముందు ప్రభుత్వంపై నోరిప్పిన ఎంపి తర్వాత ప్రభుత్వంలో తప్పులను ఒక్కొక్కటి ఎత్తిచూపుతూ వచ్చారు. చివరకు ఆయన విమర్శల దాడిని తట్టుకోలేక పోయింది. సీఐడీ ఎంట్రీతో కథ కొత్త మలుపు తిరిగింది.

ఇక రాజేందర్ విషయానికి వస్తే ఈయనకు కూడా కేసీయార్ తో చాలాకాలంగా పడటంలేదు. అయినా ఏదోలా మంత్రివర్గంలో నెట్టుకొచ్చేశారు. అయితే చివరకు ఏమైందో ఏమో కేసీయార్ కు ఒళ్ళుమండి ముందు వైద్య, ఆరోగ్య శాఖను పీకేశారు. తర్వాత ఏకంగా మంత్రివర్గం నుండే బర్తరఫ్ చేసేశారు. దాంతో కేసీయార్ పై ఈటల రెబల్ గా తయారై ప్రతిపక్షాల నేతల చుట్టూ తిరుగుతున్నారు.

అయితే ఇక్కడే అధినేతల ఆలోచనలు కూడా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఇటు రఘురామను అయినా అటు రాజేందర్ ను అయినా పార్టీల నుండి జగన్ కానీ కేసీయార్ కానీ సస్పెండ్ చేయలేదు, బహిష్కరణ వేటూ వేయలేదు. వాళ్ళంతట వాళ్ళే రాజీనామాలు చేస్తారని చూస్తున్నట్లున్నారు. కాకపోతే ఎంపిపై బహిష్కరణ వేటు వేయాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్ ఓంబిర్లాకు లేఖ ఇచ్చింది. కేసీయార్ నుండి ఈటల అనర్హతపై లేఖ ఏమీ వెళ్ళలేదు.

క్షేత్రస్ధాయిలో వ్యవహారాలు చూస్తుంటే తొందరలోనే ఈటల ఎంఎల్ఏగా రాజీనామా చేసేట్లే ఉన్నారు. ఉపఎన్నికలో తన గెలుపుపై ఈటల గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగేందకు రాజేందర్ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఎంపి విషయానికి వస్తే రాజీనామా చేసేట్లు కనబడటంలేదు.  అందుకనే తాను రాజీనామా చేసేది లేదని చెప్పేశారు.  

కొసమెరుపు - ఈటల, రఘురామ ఇద్దరు సంపన్నులే. ఇద్దరు వ్యాపారులే. ఇద్దరు వేలకోట్లకు అధిపతులే.
Tags:    

Similar News