ప్రజా ప్రతినిధులపై ఎన్ని వేల కేసులున్నాయో తెలుసా ?

Update: 2022-02-04 05:12 GMT
ఘనత వహించిన మన ప్రజాప్రతినిధులపై వేలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడ ప్రజా ప్రతినిధులంటే ఎంపీలు, ఎంఎల్ఏలు మాత్రమే. స్ధానిక సంస్ధలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధుల వ్యవహారం వేరు. సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు సహాయకుడు విజయ్ హన్సారియా తాజా నివేదిక ప్రకారం. ఎంపీలు, ఎంఎల్ఏలపైన 4984 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిల్లో ఐదేళ్ళకు పైగా విచారణకు రాకుండా పెండింగ్ లో ఉన్న కేసులే 1899 ఉన్నాయట.

హజారియా చెప్పిన ప్రకారం ఒకవైపు పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే మరోవైపు కేసుల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయట. ఈ కారణంగానే ప్రజా ప్రతినిధులపైన కేసుల విచారణ కొలిక్కి రావడం లేదన్నారు. 2018లో 4110 కేసులు పెండింగ్ లో ఉంటే 2020 అక్టోబర్ నాటికి కేసుల సంఖ్య 4959కి పెరిగింది. 2018 డిసెంబర్ తర్వాత 2775 కేసులు పరిష్కారమయ్యాయి. అయితే ఎంపీలు, ఎంఎల్ఏలపైన కేసుల సంఖ్య 4122 నుండి 4984కు పెరిగాయట.

అంటే హజారియా లెక్కల ప్రకారం అర్ధమవుతున్నదేమంటే ప్రజాప్రతినిధులపై కేసులు పరిష్కారమయ్యేది కాదని. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా నేర చరిత్రున్న నేతలను పెంచి పోషిస్తున్నాయి. అధికారంలోని పార్టీలు తమ నేతలు నేరాలకు పాల్పడుతున్నా పట్టించుకోవటంలేదు. ఎంతో పెద్ద ప్రజాందోళన జరిగితే కానీ అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు కావడం లేదు. కాబట్టి అధికారంలో ఉన్నంత కాలం సదరు నేతలకు ఎలాంటి ఇబ్బందులుండవు. అలాంటి నేతల ఖర్మకాలి ప్రతిపక్షంలోకి వస్తేనే కేసులు, విచారణ, కోర్టులకు వస్తున్నారు.

ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణకు ఎన్ని ప్రత్యేక కోర్టులు పెట్టినా ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. కారణం ఏమిటంటే అధికార, ప్రతిపక్షాల్లో లెక్కలేనంతమంది నేతలపై కేసులుండటమే. నేర చరితులకు టికెట్లు, పదవులు ఇవ్వకూడదని పార్టీలు అనుకున్నపుడు మాత్రమే వాళ్ళపైన ఉన్న కేసులు పరిష్కారమవుతాయి. ఇపుడు పెండింగ్ లో ఉన్న కేసులు 4984 ఎంత మందిపైన ఉన్నాయో తెలీదు. కొందరిపై అయితే హత్యలు, అత్యాచారాలు, హత్యాచారాలు, దొమ్మీలు, కిడ్నాపు కేసులు కూడా నమోదయ్యాయి. అంటే వీటికన్నా తక్కువ స్ధాయి నేరాలు ఎన్నిచేశారో.
Tags:    

Similar News