టి20 ప్రపంచ కప్ షురూ.. అత్యధిక టిక్కెట్లు కొన్నదెవరో తెలుసా?

Update: 2022-10-22 09:57 GMT
ధనాధన్ ఆట టి20లో ప్రపంచ కప్ సూపర్ 12 దశ షురూ అయింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో ఆతిథ్య ఆస్ట్రేలియా వారి దాయాది న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ అద్భుతంగా ఆడి 200 పరుగులు చేసింది. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే (58 బంతుల్లో 92, 7 ఫోర్లు, 2 సిక్స్లులు) అద్భుతంగా ఆడాడు. ఫిన్ అనెల్ 16 బంతుల్లో 3 సిక్స్ లు, 5 ఫోర్లతో 42 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్నిచ్చాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోంది. అయితే, ఆదివారం చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు అభిమానులు పోటెత్తుతారనడంలో సందేహం లేదు. గత నెలలోనే టిక్కెట్లు బుక్ అయిపోయాయి. ఇక ప్రపంచ కప్ లో మిగతా మ్యాచ్ లకూ అభిమానుల ఆదరణ తక్కువేమీ ఉండదని చెప్పొచ్చు.

ముందే దివాళీ... మెల్బోర్న్ లో ఆదివారం భారత్ -పాక్ తలపడుతుండడం అభిమానులకు దీపావళిని ముందుగానే తెచ్చిందని చెప్పొచ్చు. దీంతో నీలిరంగు మెల్బోర్న్ సముద్ర తీరం పోటెత్తనుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం అమ్ముడైన టిక్కెట్లలో 16 వేల టిక్కెట్లను భారతీయులే కొనుగోలు చేశారు. ఆతిథ్య ఆస్ట్రేలియా కాకుండా మరే దేశ అభిమానులూ ఇన్ని టిక్కెట్లను కొనలేదు. అయితే, ఇప్పటివరకు మొత్తం ఎన్ని టిక్కెట్లు అమ్ముడుపోయినదీ అధికార వర్గాలు తెలపడం లేదు.

45 మ్యాచ్ లు 8 లక్షల టిక్కెట్లు ప్రపంచ కప్ లో 45 మ్యాచ్ లు జరగనున్నాయి. వీటి వీక్షణకు మొత్తం 8 లక్షల పైనే టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇక భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కే కాక.. ప్రపంచ కప్ కోసం
భారత్ నుంచి 18 వేల నుంచి 20 వేల మంది తరలివెళ్లనున్నట్లు అంచనా వేస్తున్నారు.

అయితే, ఆ సంఖ్య ఇంకా పెరగొచ్చని కూడా భావిస్తున్నారు. వాస్తవానికి భారత్ - ఆస్ట్రేలియా మధ్య కొవిడ్ కు ముందు వరకు నేరుగా విమానాలు వారానికి మూడు మాత్రమే. అయితే ఇప్పుడవి మూడింతలై.. 24కు చేరాయి. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్వాంటాస్ ఢిల్లీ, బెంగళూరుకు నేరుగా సర్వీసులు ప్రారంభించింది. కాగా, ఇప్పుడిప్పుడే భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్నవారి సంఖ్య.. కొవిడ్ కు ముందునాటి సంఖ్యను అందుకుంటోంది. టి20 ప్రపంచ కప్ పాత్ర కూడా ఇందులో ఉంది. సహజంగా ఆస్ట్రేలియాకు ఏటా 45 లక్షల మంది భారతీయులు రాకపోకలు సాగిస్తుంటారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News