వైద్యులకు ‘‘గిఫ్ట్’’ రూల్ షాక్

Update: 2016-02-08 04:19 GMT
ఆసుపత్రి ఏదైనా. . అక్కడికి వైద్యం చేయించుకునేందుకు రోగులు ఎలా వస్తారో.. తమ మందుల్ని అమ్ముకునేందుకు ఫార్మా కంపెనీల సేల్స్ మ్యాన్లు అంతే కనిపిస్తుంటారు. కొన్ని ఆసుపత్రుల్లో అయితే.. ఫార్మా కంపెనీల సేల్స్ మ్యాన్లు.. ఫలానా సమయంలోనే రావాలని.. మిగిలిన సమయాలో రావొద్దన్న మాట రాసి మరీ పెడుతుంటారు. మందులు అమ్ముకునేందుకు డాక్టర్ల వద్దకు వచ్చే సేల్స్ మ్యాన్లు.. పనిలో పనిగా డాక్టర్లకు భారీగా బహుమతులు ముట్టచెప్పి వెళ్లటం కనిపిస్తుంది.

తాజాగా ఇలాంటి బహుమతుల మీద మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపించింది. తాజాగా వైద్యులకు ఇచ్చే బహుమతుల మీద పరిమితులు విధించటమేకాదు.. ఒకవేళ దీన్ని అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. వైద్యులు ఎవరైనా సరే.. మెడికల్ కంపెనీల నుంచి రూ.5 నుంచి రూ.10వేల విలువైన బహుమతులు తీసుకుంటే.. వారి డాక్టర్ లైసెన్స్ ను జాతీయ వైద్యుల రిజిస్టర్.. రాష్ట్ర వైద్యుల రిజిస్టర్ నుంచి 3 నెలలు తొలగిస్తారు. ఒకవేళ తీసుకున్నబహుమతి విలువ రూ.10 నుంచి రూ.50 వేల మధ్యలో ఉండే లైసెన్స్ ను ఆర్నెల్లు రద్దు చేస్తారు. అదే.. లక్ష రూపాయిల గిఫ్ట్ తీసుకుంటే ఏడాది పాటు సస్పెండ్ చేస్తారని చెబుతున్నారు. రూల్స్ బాగానే ఉన్నాయి.. గిఫ్ట్ లెక్క చెప్పే వారు ఎవరు? బహుమతుల మీద నిఘా వేసే వారు ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మరింత బాగుంటుంది.
Tags:    

Similar News