ప్రతి భారతీయుడికి మండేలా చేసే హ్యుందయ్ అతి

Update: 2022-02-07 10:38 GMT
యాపారం చేసుకోవాల్సినోళ్లు యాపారం చేసుకోవాలే కానీ యవ్వారాల జోలికి అస్సలు పోకూడదు. తాజాగా అలాంటి పాడు పని చేసిన ప్రముఖ కొరియన్ కార్ల కంపెనీ హ్యుందయ్ గురించి తెలిసినంతనే భారతీయుడు ఎవరికైనా ఒళ్లు మండక మానదు. భారత్ - పాక్ మధ్య ఉన్న సున్నిత అంశాల మీద అవగాహన ఉన్నప్పటికీ.. వాటిని మరిచి.. దాటకూడని గీతను దాటేసిన వైనం చూస్తే ఒళ్లు మండక మానదు. హ్యుందయ్ చేసిన పనికి ఒళ్లు మండిపోతున్న భారతీయులు పలువురు హ్యుం‘డై’ చేయాల్సిన అవసరం వచ్చిందని పిలుపునిస్తున్నారు.

హ్యుందయ్ కు మన దేశంలో మాదిరే పొరుగున ఉన్న పాకిస్థాన్ లోనే సదరు కంపెనీకి భారీ వ్యాపార వాటానే ఉంది. అయితే.. కశ్మీర్ విషయంలో పాక్ కు సపోర్టుగా చేస్తూ పెట్టిన పోస్టు ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. ఫిబ్రవరి 5న పాక్ దేశంలో కశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంఘీభావ దినాన్ని జరుపుకుంటుంటారు. తాజాగా హ్యుందయ్ పాకిస్థాన్ ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా.. ‘మన కశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుంచుకుందాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదాం’ అని పేర్కొన్నారు.

ఈ పోస్టు చూసినోళ్లలో చాలామందికి హ్యుందయ్ చేసిన పనికి ఒళ్లు మండిపోయేలా చేస్తోంది. అంతేకాదు..  #KashmirSolidarityDay  పేరుతో హ్యాష్ ట్యాగ్ ను ప్రయోగించింది. దీనిపై భారత్ లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో.. యుద్ధ ప్రాతిపదికన సదరు ట్వీట్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే పలువురు ట్విటర్ పేజీల్ని స్క్రీన్ షాట్లుగా తీసి పోస్టు పెడుతూ హ్యుందయ్ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు.

అంతేకాదు.. ఈ పోస్టుపై తన వైఖరిని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. భారతీయులు పలువురు హ్యుందయ్ విషయంలో సరైన బదులు తీసుకోవాల్సిందేనన్న వ్యాఖ్య వినిపిస్తోంది. హ్యుందయ్ చేసిన పనికి.. భారతీయలు ఎవరైనా సరే.. వారికి బుద్ది చెప్పేలా ఉండాలన్న డిమాండ్ పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. ఈ అనుకోని రీతిలో ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని హ్యుందయ్ ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
    

Tags:    

Similar News