గమనించారా? కేసీఆర్ తాజా అడుగులన్నీ మాజీ బాస్ మాదిరే!

Update: 2022-02-21 03:47 GMT
‘గుర్తుకు వస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి..’ అంటూ ఎమోషనల్ గా సాగే మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ పాట.. ఆదివారం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్ని చూసినప్పుడు చప్పున గుర్తుకు రాక మానదు. జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టటం తో పాటు.. భావసారుప్య పార్టీలను ఒక జట్టు చేయటానికి.. ఒక వేదిక మీదకు తీసుకొచ్చేందుకు వీలుగా గులాబీ బాస్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నడుం బిగించటం.. ఇప్పటివరకు ఫోన్లో మంతనాలు జరిపిన కేసీఆర్.. తాజాగా నేరుగా సదరు రాష్ట్రానికి ప్రయాణం కావటం తెలిసిందే.

మహారాష్ట్రకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు.. ఎన్సీపీ అధినేత కమ్ మరాఠా యోధుడు శరద్ పవార్ తోనూ భేటీ కావటం తెలిసిందే.

ఈ సమావేశాలకు అనుసంధానం చేయటానికి ప్రకాశ్ రాజ్ ను ఏర్పాటు చేసుకోవటం.. ఆ విషయం తాజా భేటీ ముందు వరకు ఎవరికి సమాచారం లేకపోవటంతో అందరూ కాస్తంత విస్మయానికి గురయ్యారని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మహా సీఎంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ సందర్భంగా దిగిన ఫోటోలు.. ఇచ్చిన ఫోజుల్ని చూసినప్పుడు చప్పున పాత రోజులు ఒక్కసారిగా గుర్తుకు రావటం ఖాయం. కొన్నేళ్ల క్రితం ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యత లేనట్లుగా ఉండి.. ఉనికి కోసం పోరాడుతున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సైతం గతంలో ఇలానే పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతల్ని కలవటం.. వారితో కలిసి ఫోటోలు దిగటం.. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతానని చెప్పటం లాంటివి చూసే ఉన్నాం.

ఇన్నాళ్ల తర్వాత మళ్లీ తెలుగు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఆలోచనల పుణ్యమా అని.. మరోసారి కేంద్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేలా ఒక దక్షిణాది ప్రాంతీయ పార్టీ అధినేత రంగంలోకి దిగారన్నట్లుగా ఆదివారం ఫోటోగ్రాఫర్లకు ఇచ్చిన ఫోజుల్ని చూసినంతనే గతం గుర్తుకు రాక మానదు.

మాంచి ఉత్సాహంతో.. కేసీఆర్ తాజా పర్యటనను ఫాలో అవుతున్న వారంతా.. గతంలో చంద్రబాబు ఇలాంటి ఆకాశ మార్గాల్ని విడిచిపెట్టని కారణంగా ఉన్నది పోయిన పరిస్థితి. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.
Tags:    

Similar News