వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వైవీకి సీటు లేన‌ట్టేనా?

Update: 2022-09-21 02:30 GMT
ఒంగోలు పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి కూడా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి సీటు లేద‌ని తేలిపోయింది. ప్ర‌స్తుతం వైవీ సుబ్బారెడ్డి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) చైర్మ‌న్‌గా ఉన్నారు. 2014లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి వైవీ సుబ్బారెడ్డి గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. అయితే 2019లో ఆయ‌న‌కు జ‌గ‌న్ సీటు నిరాక‌రించారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన మాగుంట శ్రీనివాసుల‌రెడ్డికి జ‌గ‌న్ సీటు ఇచ్చారు. దీంతో మాగుంట 2 ల‌క్ష‌ల ఓట్ల‌కు పైగా మెజారిటీతో ఘ‌న‌విజ‌యం సాధించారు.

గ‌తంలో 1998, 2004, 2009 ఎన్నిక‌ల్లో మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా ఒంగోలు నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగుంట‌.. వైఎస్సార్సీపీ అభ్య‌ర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. కాగా  వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు బ‌దులుగా త‌న కుమారుడు రాఘ‌వ‌రెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేస్తార‌ని తాజాగా మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం విశేషం. త‌న‌కు 60 ఏళ్లు వ‌చ్చాయ‌ని.. ఇక తాను విశ్రాంతి తీసుకుంటాన‌ని మాగుంట చెబుతున్నారు.

తాజాగా ఒంగోలులో మీడియా స‌మావేశంలో మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి మాట్లాడారు. ఇటీవ‌ల ఢిల్లీ మ‌ద్యం స్కామ్‌కు సంబంధించి త‌న నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు చేసిన త‌నిఖీల గురించి వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న బంధువులు చేసే వ్యాపారాల‌కు సంబంధించి త‌న పేరును బ‌య‌ట‌కు తీస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తమ కుటుంబం ఎన్నో ఏళ్లుగా మ‌ద్యం వ్యాపారంలో ఉందని.. అయితే ఎలాంటి అక్ర‌మాల‌కు తాము పాల్ప‌డ‌లేద‌ని మాగుంట వివ‌రించారు. 8 రాష్ట్రాల్లో త‌మ బంధువులు వ్యాపారాలు చేసుకుంటున్నార‌ని.. అక్క‌డ ఉండే వ్యాపారులు వారికి పోటీ వ‌స్తున్నార‌ని త‌న పేరును బ‌య‌ట‌కు లాగి ర‌చ్చ చేశార‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ గురించి మాట్లాడిన మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి తాను పోటీ చేయ‌న‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు బ‌దులుగా త‌న కుమారుడు రాఘ‌వ‌రెడ్డి పోటీ చేస్తార‌ని తెలిపారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తార‌నేదానిపై మాగుంట స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డం విశేషం. ఇప్ప‌టికే మాగుంట.. కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్సీపీల‌ను చుట్టేశారు. ఒక‌వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేస్తే వైవీ సుబ్బారెడ్డికి మ‌ళ్లీ సీటు ద‌క్క‌న‌ట్టే.

గ‌తంలోనే త‌న‌కు సిట్టింగ్ ఎంపీగా సీటు ఇవ్వ‌కపోవ‌డంపై వైవీ సుబ్బారెడ్డి అలిగార‌ని వార్త‌లు వ‌చ్చాయి. క‌నీసం త‌న‌ను రాజ్య‌స‌భ‌కు అయినా పంపాల‌ని జ‌గ‌న్ ను కోరిన‌ట్టు చెబుతారు. అయినా జ‌గ‌న్ ఆయ‌న‌కు రాజ్య‌స‌భ అవ‌కాశం కూడా ఇవ్వ‌లేదు. 2019లో అధికారంలోకి రాగానే వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మించారు. ఇప్ప‌టికే మూడేళ్లు ప‌ద‌వీకాలాన్ని పూర్తి చేసుకున్న ఆయ‌న మ‌రో రెండేళ్లు టీటీడీ చైర్మ‌న్‌గానే ఉండ‌నున్నారు.

మాగంట మాట‌ల‌ను బ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వైవీ సుబ్బారెడ్డికి సీటు లేద‌ని తేలిపోతున్న నేప‌థ్యంలో ఇక వైవీ సుబ్బారెడ్డి ముందు అసెంబ్లీకి పోటీ చేసే ఆప్ష‌న్ మాత్ర‌మే మిగిలి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News