బీజేపీపై ఆధారపడటం పవన్ కు ఇష్టం లేదా?

Update: 2022-10-17 04:35 GMT
ఆధారపటం అంత మంచిది కాదు. నిజానికి బలంగా ఉన్నోడ్ని సైతం బలహీనంగా తయారు చేసేది ఆధారపడటం. అందుకే సమర్థులైన వారు ఎవరి మీదా ఆధారపడటానికి ఇష్టపడరు. రాజకీయాల్లో ఉన్న వారు ఒకరి బలాన్ని నమ్ముకొని రాజకీయం చేస్తామంటే అంతకు మించిన వెర్రి పని మరొకటి లేదు.

ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నారన్న విషయం తాజాగా ఆయన మాటల్ని వింటే ఇట్టే అర్థమవుతుంది. బీజేపీకి మిత్రుడిగా ఉన్న ఆయన.. తన బలాన్ని మాత్రమే తాను నమ్ముకోవాలి తప్పించి.. కమలనాథుల బలాన్ని తాను పరిగణలోకి తీసుకోకూడదన్న విషయంపై మొదట్నించి క్లారిటీతోనే ఉన్నారని చెప్పాలి.

అయితే.. మిత్రుడిగా ఉన్నప్పుడు లభించే సానుకూలాంశాలు ఏవీ బీజేపీతో తనకు రావట్లేదన్న విషయాన్ని గుర్తించిన పవన్.. తన బలాన్ని లెక్కలోకి తీసుకొనే అడుగులు వేస్తున్నారు. తాజాగా విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్ద ఏపీ మంత్రులపై జనసేనకు చెందిన కార్యకర్తలు దాడి చేసిన ఎపిసోడ్ తెలిసిందే. నిజానికి ఈ ఇష్యూలో పవన్ కు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదు. కానీ.. ఆయన్ను ఆ దాడి ఇష్యూలోకి తీసుకొచ్చేందుకు విశాఖ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పలువురు తప్పు పడుతున్నారు.

ఆదివారం పవన్ కు నోటీసులు ఇవ్వటం.. ఆయన బస చేసిన నొవాటెల్ వద్ద పోలీసుల హడావుడిపైనా విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన పవన్.. పలు అంశాల మీద మాట్లాడారు. అన్నింటికి మించి.. బీజేపీ ప్రస్తావన తెచ్చిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో గొడవ జరిగిన ప్రతిసారీ కేంద్రంలో ఉన్న బీజేపీతో మీరు పొత్తు ఉన్నారు కదా.. వారికి చెప్పొచ్చు కదా? అని కొందరు తనతో అంటున్నారని.. దానిపై ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

తాను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని.. తమకు లక్షల్లో ఓట్లు ఉన్నాయని.. తాము మాట్లాడితే కోట్లాది మందికి చేరుతుందన్న పవన్.. 'తెలుగు నేల కోసం మేం చేస్తున్న యుద్ధం ఇది' అంటూ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. జగన్ ఇష్యూలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్నారన్న భావన కలుగుతుంది. అంతేకాదు..

బీజేపీ అధినాయకత్వంపై తాను ఎందుకు ఆధారపడాలన్న విషయాన్ని పవన్ తన మాటలతో స్పష్టం చేశారని చెప్పాలి. ఇదంతా చూస్తే.. ఎవరి బలం తనకు అవసరం లేదని.. తనకంటూ సొంత బలం ఉందన్న విషయాన్ని పవన్ నమ్మటమే కాదు.. ఆ విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నంలో భాగమే తాజా వ్యాఖ్యలని చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News