పిట్ట ప్లేసులో కుక్క.. ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం

Update: 2023-04-04 12:55 GMT
ట్విట్టర్ అనగానే మనకు ఏం గుర్తుకు వస్తుంది.. ఆ నీలం రంగులోని పిట్ట మదిలో మెదులుతుంది. ట్విట్టర్ మొదలుపెట్టినప్పటి నుంచి  ఆ పిట్ట సంస్థకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లా కనిపించింది. పిట్ట పలుకులు లాగా ట్విట్టర్ ట్వీట్లు ప్రపంచ వ్యాప్తంగా ఒక సెన్షేషన్ ను క్రియేట్ చేశాయి. అంతటి ఫేమస్ ట్విట్టర్ పిట్టను ఒక్క నిర్ణయంతో పీకి పడేశాడు దాని ఓనర్, ప్రపంచంలోనే కుబేరుడు ఎలన్ మస్క్. పిట్ట అరుపులకు చెక్ పెట్టేసి.. కుక్క మొరగడాన్ని ఇక చూపించబోతున్నట్టు తేల్చేశాడు.

ట్విట్టర్ కు ఆ పిట్టనే అందం.. కానీ ఆ అందాన్ని ఇప్పుడు 'కుక్క'తో భర్తీ చేశాడు మన దాని యజమాని ఎలన్ మస్క్. ట్విటర్ ను కొన్నప్పటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగులను చాలా మందిని తీసేసి.. ఖర్చులు తగ్గింపు పేరిట కాస్ట్ కటింగ్ చేసి.. ట్విట్టర్ లో బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తూ నానా పెంట చేసేస్తున్నాడు ఎలన్ మస్క్. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్  కు ఎంతో పేరు తీసుకొచ్చిన లోగోనే మార్చేసి పెను దుమారం రేపాడు.

ఇప్పటివరకూ ట్విట్టర్ లోగో గా ఫేమస్ పక్షి అయిన 'బ్లూ బర్డ్' ఉండేది. ఆ లోగోను పీకేసిన ఎలన్ మస్క్ ఇప్పుడు డాని స్థానంలో కుక్క (డాగీ) లోగోను పెట్టాడు. అయితే ఇది కేవలం డెస్క్ టాప్ వెర్షన్ లో మాత్రమే. మొబైల్ లోనూ మార్చడానికి కసరత్తు చేస్తున్నాడట.

తాజాగా ఈరోజు ట్విటర్ వెబ్ సైట్ లో హోం బటన్ గా ఉన్న ఐకానిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో 'డాగీ కాయిన్' క్రిప్టో కరెన్సీ లోగోకు చెందిన డాగ్ మీమ్ కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. డాగీ చిత్రం క్రిప్టో కరెన్సీ డాగీ కాయిన్ గా చాలాకాలంగా వైరల్ మీమ్స్ లో కనిపిస్తోంది. దాన్ని ట్విట్టర్ డెస్క్ టాప్ లోగోగా ఎలన్ మస్క్ పెట్టడంపై నెటిజన్లు షాక్ అయ్యారు.

ఇక డాగీని మారుస్తూ ట్విట్టర్ లో ఎలన్ మస్క్ గతంలో ఓ ట్విట్టర్ యూజర్ కు తనకూ జరిగిన సంభాషణను సెటైర్ గా పంచుకున్నారు. మార్చి 26 2022న ఓ అజ్ఞాత యూజర్ ట్విట్టర్ బర్డ్ లోగోను 'డాగ్'గా మార్చమని అడగ్గా దానికి మస్క్ సరే అని బదులిచ్చాడు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నట్లు ఆ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది.

అయితే క్రిప్టో కరెన్సీ డాగీ కాయిన్ ను ప్రోత్సహించేందుకు. క్రిప్టోను పాపులర్ చేసేందుకు ఇలా ఎలన్ మస్క్ కుట్ర చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ట్విట్టర్ లోగోను డాగీ లోగా మార్చిన తర్వాత క్రిఫ్టో డాగీ కాయిన్ విలువ 20శాతం వరకూ పెరగడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News