వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్

Update: 2020-03-09 13:27 GMT
స్థానిక ఎన్నికలకు ముందు ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. లోకల్ వార్ వన్ సైడ్ అని....వైసీపీ క్లీన్ స్వీప్ ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. బలమైన వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు...మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్యా మాణిక్య వరప్రసాద్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో డొక్కాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన డొక్కాను జగన్ అభినందించారు. సీఎం జగన్ అభివృద్ధి పనుల్లో భాగస్వామిని అవుతానని, ఆ ఉద్దేశంతోనే పార్టీలో చేరానని డొక్కా చెప్పారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా చేశారు. ఆ రాజీనామాపై వచ్చిన విమర్శలపై ఇవాళ ఉదయం సుధీర్ఘ వివరణ కూడా ఇచ్చారు. వివరణ ఇచ్చిన కొన్ని గంటల్లోనే డొక్కా వైసీపీలో చేరడం టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదు.

ఇక, మరోవైపు గత ఏడాది చివర్లో టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో రెహమాన్ వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయాలు, సంక్షేమ పథకాలను స్వాగతిస్తున్నామని అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన రోజే వైసీపీకి మద్దతు పలికామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కడప జిల్లాలోనూ టీడీపీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగలబోతోందంటూ ఊహాగానాలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, టీడీపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడం దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. రామసుబ్బారెడ్డితోపాటు  రాయచోటి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 1984లో రాజంపేట లోక్ సభ స్థానం నుండి టీడీపీ ఎంపీగా గెలుపొంది పాలకొండ్రాయుడు కూడా త్వరలో వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు ముందు టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని ప్రచారం జరుగుతోంది.



Tags:    

Similar News