డొక్కా సంచలన నిర్ణయం: టీడీపీకి రాజీనామా

Update: 2020-03-09 07:39 GMT
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా జిల్లాల్లో పార్టీలోని కీలక నాయకులు పార్టీని వీడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా టీడీపీకి భారీ షాక్‌ ఇస్తూ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. టీడీపీ అధిష్టానం వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులకు బహిరంగ లేఖ రాశారు.

గుంటూరు జిల్లాలో కీలక నాయకుడితో పాటు దళిత వర్గానికి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద రావు ఈ నిర్ణయం తీసుకోవడంతో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. డొక్కా రాజీనామాతో పల్నాడు రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే శాసనమండలి సమావేశాల సందర్భంగా డొక్కా తీరుపై టీడీపీలో విమర్శలు వచ్చాయి. దీంతో పాటు చంద్రబాబు వైఖరితో ఆయన విసుగుచెందాడని తెలుస్తోంది. మనస్తాపానికి గురై తెలుగుదేశానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అధిష్టాన వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని లేఖలో పేర్కొంటూనే రాజధాని రైతుల జేఏసీ పేరుతో తన పై తప్పుడు ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల చౌకబారు విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కూడా టీడీపీ అధిష్టానం తీరు తనను మానసికంగా కలచివేసిందని వివరించారు. శాసనమండలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే తాను వైఎస్సార్‌సీపీకి మానసికంగా దగ్గరయ్యానని.. అయితే వైఎస్సార్‌సీపీ నాయకత్వం తో ఎటువంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. పార్టీ వైఖరితోనే జనవరి 21వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలోనే జగన్ సమక్షం లో అధికార పార్టీ లో చేరే అవకాశం ఉంది.
Tags:    

Similar News