ఆకాశాన్నంటుతున్న డాలర్.. ఏం జరుగనుంది?

Update: 2022-10-20 00:30 GMT
అమెరికా డాలర్ ఆకాశాన్ని అంటింది. అన్ని దేశాలను భయపెడుతోంది.బ్రిటీష్ పౌండ్, జపాన్ యెన్, యూరో వంటి ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ మారకం రేటు ఈ సంవత్సరం ఇప్పటివరకూ 18శాతం పెరిగింది. 20 ఏళ్ల గరిష్ట స్తాయికి చేరింది. ఈ ప్రభావం మన భారత రూపాయితోపాటు అన్ని దేశాల కరెన్సీలపైనా కనిపిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో డాలర్ తో రూపాయి రూ.74.5 ఉండగా.. ఇప్పుడు రూ.82.5కు చేరింది. 9 నెలల్లోనే డాలర్ తో రూపాయి మారకం విలువ 10శాతం వరకూ పడిపోయింది. యూరో, బ్రిటీష్ పౌండ్ లదీ అదే పరిస్థితి. ఈజిప్ట్, టర్కీ దేశాల కరెన్సీ 28శాతం పడిపోయింది.

ఇక ధరలు అమెరికాలో సెగ పుట్టిస్తున్నాయి.  అగ్రరాజ్యం ధరాఘాతంతో ఆగమాగమవుతోంది. ఎన్నడూ లేనంత స్థాయిలో ధరలు పెరిగి ప్రజలు బావురుమంటున్నారు. అమెరికాలో ధరలు పెరుగుతూనే ఉన్నందున అమెరికా ప్రజలు కొనడానికి జంకుతూ మధ్యతరగతి వారంతా అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగడంతో ఈ పరిస్థితి దాపురించింది. ధరలన్నీ చుక్కలనంటుతున్నాయి.. డాలర్ సెగతో దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక పరిస్తితులు కుదలేవుతున్నాయి. అనేక దేశాలు ఇంధనంతోపాటు ఆహార వస్తువుల ధరలు చుక్కలనంటి ఆయా దేశాల్లో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి సంపన్న దేశాల్లోనూ ఇదే పరిస్తితి. డాలర్ పెరుగుదలతో అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులు పునరాలోచనలో పడుతున్ానరు.

ఆహారం , ఇంధన ధరలు మినహా ప్రధాన ద్రవ్యోల్బణం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్‌లో 6.6 శాతం పెరిగిందని అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ గురువారం తెలిపింది. ఇది ఆగస్ట్‌లో 6.3 శాతం నుండి కూడా పెరిగింది. 1982 నుండి ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. అధిక ధరల కట్టడికి ఫెడరల్ బ్యాంక్ 75 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు పెంచినా ధరల్లో పెద్ద మార్పు రాకపోవడం గమనార్హం.

అధికారిక డేటా ప్రకారం.. నెలవారీ ప్రాతిపదికన, కోర్ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 0.6 శాతం పెరిగింది. అమెరికాలో వస్తు సేవలకు డిమాండ్ అధికంగా ఉండడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. వడ్డీ రేట్ల పెంపుతో దీనికి చెక్ పెట్టేందుకు ఫెడరల్ రిజర్వ్ రంగంలోకి దిగింది. ఉద్యోగకల్పనపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఉద్యోగకల్పనలో వృద్ధి రేటు ఏకంగా సగానికి పడిపోతోంది. ఇక వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచి నెలనెలా 1,75,000 ఉద్యోగావకాశాలు కనమరుగవుతాయి. 2023 మొత్తం ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని బ్యాంకు అంచనావేస్తోంది.

ఈ ద్రవ్యోల్బణం కారణంగా.. అమెరికా స్టాక్ ఫ్యూచర్‌లు పడిపోయాయి. ద్రవ్యోల్బణం డేటా అగ్రస్థానంలో ఉన్న తర్వాత ట్రెజరీ దిగుబడులు పెరిగాయి. డాలర్ కూడా పుంజుకుంది. ఇది ప్రపంచ మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. వడ్డీ రేట్లు పెరగడం.. డాలర్ పెరగడంతో విదేశాలు మారకం కోసం అధిక డబ్బులు వెచ్చించాల్సి రావడంతో ప్రపంచ దేశాలు కుదేలవుతున్నాయి.

కోవిడ్ దెబ్బ.. ఆ తర్వాత ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో డాలర్ కు రెక్కలు వచ్చాయి. మాంద్యం భయాలు అలుముకున్నాయి. ప్రజలు తప్పనిసరి అయితే తప్ప కొనుగోలు చేయడం లేదు. పరిస్తితులు ఇలానే ఉంటే ఈ ఏడాది చివరి వరకూ అమెరికా, యూరప్ దేశాలు ఆర్థికమాంద్యంలోకి పోతాయని అంచనావేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News