పెరుగుతున్న ట్రంప్.. తగ్గుతున్న హిల్లరీ

Update: 2016-09-04 05:35 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికలు వన్ సైడెడ్ గా జరగనున్నాయన్న అభిప్రాయం తప్పని మరోసారి తేలిపోయింది. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై  తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే సమయంలో డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ హవా నడుస్తోందని.. ఆమె గెలుపు నల్లేరు మీద నడకేనన్న అభిప్రాయం సరికాదన్న వాదనకు బలం చేకూరేలా తాజాగా సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి.

కొన్ని కీలక ప్రాంతాల్లో హిల్లరీ అధిపత్యం నడుస్తున్నా.. ట్రంప్ బలం కూడా పెరుగుతుందన్న వాదనను కొట్టిపారేయలేమని చెప్పొచ్చు. గడిచిన నెలలో హిల్లరీ అధిక్యం తగ్గగా.. ట్రంప్ అధిక్యం పెరగటం గమనార్హం. రెండు వరుస కన్వెన్షన్ల తర్వాత ‘పోల్ ఆఫ్ పోల్స్’ జరిపిన సర్వేలో క్లింటన్ 49 పాయింట్లతో ముందుంగా.. ట్రంప్ 39 పాయింట్లతో ఉన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గడిచిన నెల వ్యవధిలో క్లింటన్ అధిక్యం ట్రంప్ పై సగటున 4.1 శాతం తగ్గిందని చెబుతున్నారు. తాజాగా వెల్లడైన సర్వే ఫలితాల నేపథ్యంలో డెమొక్రాట్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఫ్లోరిడా.. ఓహియో.. మిచిగాన్.. కొలరాడో.. వర్జీనియా.. జార్జియా.. పెన్సివేనియా.. నెవడా.. న్యూ హాంప్ షైర్.. నార్త్ కరోలినా.. విస్కాన్సిన్ లలో హిల్లరీ స్పష్టమైన అధిక్యతతో ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే మాత్రం ఆమె అధిక్యం తగ్గి.. ట్రంప్ అధిక్యం పెరగటం కీలక పరిణామంగా చెబుతున్నారు. ఇది హిల్లరీకి ఒక అలెర్ట్ అని చెప్పొచ్చు.
Tags:    

Similar News