ట్రంప్ విక్ట‌రీలో పుతిన్ హ‌స్తం...నిద‌ర్శ‌నం ఇదిగో!

Update: 2017-07-19 07:03 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యం నిజంగానే కొత్త‌గా ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన ఆ దేశ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ త‌న ప్ర‌త్యర్థి హిల్ల‌రీ క్లింట‌న్‌ ను ఓడించి అమెరికా అధ్య‌క్ష పీఠాన్ని ద‌క్కించుకున్న ట్రంప్‌... పాల‌న‌లో త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. ముస్లిం దేశాల‌న్నా - ముస్లిం స‌మాజం అన్నా అల్లంత దూరంలో పెడుతున్న ట్రంప్‌... అమెరికాకు శ‌త్రువులుగా ఉన్న దేశాల‌తో క్లోజ్‌ గా మూవ్ అవుతున్న వైనం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావ‌డంలో... అమెరికాకు బ‌ద్ధ శ‌త్రువుగా ఉన్న ర‌ష్యా హ‌స్తం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతున్నాయి. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాయంతోనే ఎన్నిక‌ల్లో ట్రంప్ విజ‌యం సాధించ‌గ‌లిగార‌న్న వార్త‌ల‌కు ఇప్పుడు బ‌లం చేకూరుస్తూ కొన్ని సంగ‌తులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

మొన్న‌టి జీ20 స‌ద‌స్సు సంద‌ర్భంగా అమెరికా - ర‌ష్యాల మ‌ధ్య ద్వైపాక్షిక భేటీ జ‌రిగింది. అమెరికా త‌ర‌ఫున ఆ దేశ అధ్య‌క్షుడి హోదాలో ట్రంప్‌ - ర‌ష్యా త‌ర‌ఫున ఆ దేశ అధ్య‌క్షుడి హోదాలో పుతిన్‌ లు హాజ‌రైన ఈ భేటీలో ఇరు దేశాల‌కు చెందిన విదేశాంగ శాఖ మంత్రుల‌తో పాటు ఇరు దేశాల కీల‌క అధికారులు కూడా పాలుపంచుకున్నారు. దాదాపుగా రెండు గంట‌ల‌కు పైగా సాగిన ఈ భేటీలో ఇరు దేశాల మ‌ధ్య ప‌లు ద్వైపాక్షిక అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఈ భేటీ ముగిసిన త‌ర్వాత ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు - అధికారులు బ‌య‌ట‌కు రాగా... ట్రంప్‌ - పుతిన్‌ లో ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు. దాదాపు గంట‌కు పైగా సాగిన ఈ భేటీలో ఇరువురి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశాల‌పై అంత‌గా స్ప‌ష్ట‌త లేదు. అస‌లు స‌మావేశ‌మే ర‌హ‌స్య‌మైన‌ప్పుడు... ఆ స‌మావేశంలో ఏఏ అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చి ఉంటాయోన‌న్న అనుమానాలు ఇరు దేశాల ప్ర‌జ‌లనే కాకుండా ప్ర‌పంచ దేశాల ప్ర‌జ‌లకు ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక భేటీ బ‌హిరంగ‌మే అయినా... ఆ త‌ర్వాత పుతిన్‌ - ట్రంప్‌ ల భేటీ ర‌హ‌స్యంగా జ‌రిగింద‌న్న విష‌యం ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌ను ఆయోమ‌యంలోకి నెట్టేసింద‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే... ఈ ర‌హ‌స్య భేటీకి సంబంధించి తొలుత వెలువ‌డిన వార్త‌ల‌ను తోసిపుచ్చిన అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌస్ ఆ త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ట్రంప్‌ - పుతిన్‌ ల మ‌ధ్య ర‌హ‌స్య భేటీ నిజ‌మేన‌ని ఒప్పుకుంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన యూరేషియా గ్రూప్‌ అధ్యక్షుడు ఇయాన్‌ బ్రెమ్మర్‌ మొదట వెల్లడించారు. ఈ రహస్య భేటీని వైట్‌హౌస్‌ మొదట తోసిపుచ్చినా.. అనంతరం ధ్రువీకరించింది. జీ20 సదస్సు సందర్భంగా జ‌రిగిన భేటీలో ట్రంప్‌-పుతిన్‌ ముఖాముఖి మాట్లాడారని, ఈ విందులో అధికారిక సిబ్బంది కానీ, మంత్రులు కానీ పాల్గొనలేదని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి మైఖేల్‌ అంటన్‌ తెలిపారు.
Tags:    

Similar News